Friday 2 May 2014

శేఖర్ కమ్ముల..'అనామిక': రివ్యూ


'ఆనంద్', 'హ్యాపీడేస్', 'లీడర్' వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలతో క్లాస్, యూత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. శేఖర్ కమ్ముల అంటే ఒక జోన్ సినిమాలకే పరిమితం అనే కామెంట్ ఉంది. కానీ తొలిసారి 'అనామిక' తో ప్రయోగం చేశాడు. బాలీవుడ్ హిట్ మూవీ 'కహానీ'ని తెలుగులో రీమేక్ చేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో 'అనామిక' పేరుతో తెరకెక్కించాడు. అయితే 'కహానీ'కి అచ్చు రీమేక్ లా కాకుండా కేవలం మూల కథను తీసుకొని దాదాపు 70శాతం మార్పులు చేసి రూపొందించిన 'అనామిక' ఈ గురువారం 'మేడే' సందర్భంగా మన ముందుకు వచ్చింది. అయితే ఈ బుధవారం రాత్రే ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ఫస్ట్ రీల్ విడుదల చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు శేఖర్. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'అనామిక' ప్రేక్షకులను ఆకట్టుకుందా.. ? శేఖర్ ప్రయోగం ఫలించిందా.. ? అనేది చూద్దాం..
కథ విషయానికి వస్తే..
   
అనామిక (నయనతార) పది రోజులుగా కనిపించని తన భర్తని వెతుక్కుంటూ ఇండియాకి వస్తుంది. పాతబస్తీలో అతను బస చేసిన హోటల్‌లోనే దిగుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఎస్ఐ పార్థసారధి (వైభవ్) అనామికకు హెల్ప్ చేస్తుంటాడు. భర్త ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. అనామికతో కలిసి సారథి చేసే విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఖాన్ ( పశుపతి ) మాత్రం అతను అనామిక భర్త కాదని తీవ్రవాది 'మిలింద్ దామ్జీ' అని వాదిస్తుంటాడు. ఇంతకూ అజయ్ శాస్త్రి దొరికాడా..? ఈ మిలింద్ దామ్జీ ఎవరు..? మిలింద్ దామ్జీకి అజయ్ కు సంబంధమేంటి..? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:..
    
బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన 'కహానీ' నుంచి కేవలం మూల కథనే తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, యండమూరితో కలిసి 'అనామిక'ను సృష్టించాడు. 'కహానీ'కి రీమేక్ కాదు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే విద్యాబాలన్ ప్రెగ్నెంట్ గా రావడం.. క్లైమాక్స్ లో ప్రెగ్నెంట్ కాదని రివీల్ అవ్వడమే కహానీ లో పెద్ద థ్రిల్. కానీ అటువంటి థ్రిల్ ని కాదని కొత్త కథను రాసుకోవడం కాస్త రిస్క్ అయినా శేఖర్ కొత్త దారిలో నడిచేందుకే ప్రయత్నించాడు. అందుకు ప్రతిఫలంగా 'అనామిక' రూపం మారింది. అయితే 'కహానీ' తో పోల్చితే.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొదలైన పదినిముషాలు ఆసక్తిగా సాగినా .. ఆ తర్వాత స్లోగా మారింది. కథలోకి తీసుకెళ్లడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో ఫస్టాఫ్ లో ఆసక్తి తగ్గింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్పుకునే ఈ మూవీలో థ్రిల్లింగ్ లేకపోవడమే ఆడియెన్స్ కు కాస్త బోర్ కొట్టించింది. ఇక సెకాండాఫ్ మాత్రం చాలా వేగంగా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు మూవీపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ చిత్రంలో చాలా లాజిక్ లు వదిలేశాడు శేఖర్. దర్శకునిగా అతని వైఫల్యం ఇది. 'అనామిక' భర్త ఉగ్రవాదని తనకు ఎప్పుడు తెలిసింది..? ఎలా తెలిసింది..? అనే చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. అంతేకాదు.. 'అనామిక'తన భర్త విషయంలో.. సమాజం పట్ల ప్రేమా లేక తను మోసపోయాననే పగా.. ? అనామిక ఎందుకు ఇలా చేసిందనే దానిపై క్లారిటీ లేదు.
సినిమాకి నయనతారే పెద్ద అసెట్. గ్లామర్ గా కనిపిస్తూనే అవసరమైన చోట పవర్ పుల్ గా మారింది. తను ఏడుస్తూ.. ఆడియెన్స్ ను కూడా కాస్త ఏడిపిస్తూ.. పాత బస్తీలో తిరిగింది. ఇక మ్యూజిక్ విషయంలో కీరవాణి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. రెండు పాటలే ఉన్నా.. ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. సాధారణంగా కనిపించే సన్నివేశాలకు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. తెర మీద హీరో నయనతార అయితే తెర వెనుక హీరో కీరవాణి అయ్యాడు. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన 'అనామిక'లో ఫొటోగ్రఫీకి, కామెడీకి ఛాన్స్ లేదు. వైభవ్ పాత్ర తేలిపోయింది. పోలీస్ ఆఫీసర్ గా చాలా పేలవంగా కనిపించాడు. పశుపతి, హర్షవర్ధన్ రాణే ల నటన ఫర్వాలేదనిపించారు. క్లైమాక్స్ లో శేఖర్ ఇచ్చిన ట్విస్ట్ బాగుంది.
ప్లస్ పాయింట్స్: నయనతార, కీరవాణి మ్యూజిక్, సెకండ్ ఆఫ్.
మైనస్ పాయింట్స్: దర్శకత్వం, కథనం.
'రోజా', 'మనోహరం' లాంటి సినిమాలు గుర్తుకు వస్తున్నా 'అనామిక' క్లైమాక్స్ ట్విస్ట్.. 'కహానీ' చూడనివారికి నచ్చే అవకాశం ఉంది. ఇక ఈమూవీకి '10టివి' ఇచ్చే రేటింగ్-2/5.

No comments:

Post a Comment