Thursday 1 May 2014

'ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన' సినిమాల్లో మేడే జాడేది..?!



     ''ఎముకలు కుళ్ళిన…వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి!నెత్తురు మండే…శక్తులు నిండే సైనికులారా! రారండి..! హరోం! హరోం హర..హర! అని కదలండి! మరో ప్రపంచం…మహా ప్రపంచం'' అంటూ శ్రీశ్రీ భావోద్వేగంతో రాసుకున్న కవితలన్నీ ప్రపంచ కార్మికుల గుండెల్లో ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రజ్వలిస్తూనే…ఉంటాయి.
'మేడే' నేపథ్యం...
    1886 చికాగోలో పనివాళ్ళకి 8 గంటల మాత్రమే పనిగంటలుండాలని చేసిన సమ్మెలో జరిగిన మారణహోమానికి గుర్తుగా జరుపుకునేదే 'మేడే'. ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే మేడే రోజు కార్మికులకు సెలవు దినంగా ప్రకటించటం జరిగింది. 1889లో ఫ్రెంచ్ రివల్యూషన్ శతాబ్దిని చేసుకుంటున్న సందర్భంలో 1890 నుండి చికాగో ఘటనకు గుర్తుగా 'మేడే' ని జరుపుకోవాలనే ప్రతిపాదన వచ్చింది. 1991 నుంచి మేడే ను ప్రతి సంవత్సరం జరపుకునే వేడుకగా అంతర్జాతీయ ద్వితీయ కాంగ్రెస్ లో నిర్ణయం జరిగింది. ఆ తర్వాత 1894 లో మేడే విప్లవం జరిగింది. 1904 లో మే 1 వ తేదీని ఎనిమిది గంటల పనివేళలుగా పనిదినాలను నిర్ణయించటానికి, ప్రపంచ శాంతికి మేడే గా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
   కారల్‌మార్క్స్, లెనిన్‌, స్టాలిన్‌ లు చూపిన మార్గ దర్శకత్వంలో ప్రపంచంలో ఉండే కార్మిక, కర్షక సోదరులంతా ఏకం అయ్యారు. వాళ్ల గుండెలోతుల్లో నుంచి పుట్టుకొచ్చిందే ప్రపంచ కార్మిక దినోత్సవం. మన తెలుగు సినిమాలు తొలితరం నుంచి కూడా జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా భూపోరాటాలపై, కార్మిక సంక్షేమంపై చాలా చిత్రాలే వచ్చాయి. ఒకప్పుటి నాగయ్య కాలం నుంచి నేటి ఆధునిక యుగంలో హీరోల దాకా కార్మికుల సమస్యలపై కేంద్రీకరించే కథలతో సినిమాలు ఎన్నో వచ్చాయి.
కార్మికుల సమస్యలపై వచ్చిన సినిమాలు..
   
మహానటుడు ఎన్‌.టి.రామారావు.. 'రైతుబిడ్డ', 'రిక్షారాముడు', 'డ్రైవర్‌ రాముడు' లాంటి కార్మిక పాత్రలతో అభిమాన ప్రేక్షకులకు దగ్గర య్యారు. హీరో కృష్ణ కూడా ఎర్రజెండాలు పట్టుకుని కార్మిక పక్షపాతిగా 'జగన్నాధ రథచక్రాలు' సినిమాలో నటించారు. అలాగే 'ప్రజారాజ్యం' సినిమాలో ఆయన రైతుకూలీ సంఘం నాయకుడిగా నటించారు. మాదాల రంగారావు హీరోగా నటించిన చిత్రాలన్నీ దాదాపు కార్మిక సమస్యలను ప్రతిబింభించేవే కావడం విశేషం. 'ఎర్రమల్లెలు' చిత్రంలో కార్మికుల సమస్యలను చక్కగా విశ్లేషించారు. 'మేడే' అంటూ అందులోని పాట ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెక్కుచెదరలేదు. ఇక ప్రజానటుడు ఆర్‌. నారాయణమూర్తి కేవలం కార్మిక, కర్షక సమస్యల మీద అనేక చిత్రాలను తీసి విజయం సాధించారు. తెలుగు చిత్రసీమలో ఎర్రజెండా రెపరెపలాడేలా చేశారు. 'ఎర్రజెండెర్రజెండెన్నియల్లో…ఎర్రెర్రని జెండా ఎన్నియల్లో..' అంటూ నారాయణమూర్తి పాడిన పాటలు విప్లవభావాలు రేకెత్తేవిగా …ఉద్వేగపూరితంగా ఉంటాయి. రీసెంట్‌గా 'లక్ష్మీ' చిత్రంలో హీరో వెంకటేష్‌ మొదట్లో యజమానిగా తర్వాత పరిస్థితుల ప్రభావంతో అదే కంపెనీలో పనిచేసే సాధారణ కార్మికుడిగా పనిచేసి యజమానికి, కార్మికుడికి ఉన్న అనుబంధాన్ని చక్కని కోణంలో ఆవిష్కరించారు తన నటనతో. నటభూషణ శోభన్‌బాబు కూడా 'మనుషులు మారాలి' చిత్రంలో కార్మికుడిగా నటించారు. బాలకృష్ణ 'రాము' చిత్రంలో, చిరంజీవి 'ఘరానా మొగుడు', కృష్ణంరాజు 'సీతారాములు' అక్కినేని నాగేశ్వరరావు 'పవిత్రబంధం' చిత్రంలో కార్మికుడిగా నటించారు.
శ్రమ జీవుల కష్టాలను తెలిపే సినిమా పాటలు..
   
పెట్టుబడి దారి వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమజీవి దోపిడీకి గురి అవుతూనే ఉంటాడు. లాభాపేక్షతో మనిషిని పీల్చి పిప్పి చేస్తారు. దేశం మారింది, కాలం కూడా మారింది. వీటన్నింటితో పాటు శ్రమజీవి కష్టం కూడా మారితే ఆ రోజు నిజమైన పండగ రోజే అవుతుంది. 'మా భూమి'..గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన అపురూప చిత్రం. ఆ చిత్రంలోని 'పల్లెటూరి పిల్ల గాడా..' అనే పాట ఏళ్ళు గడిచినా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. పల్లెటూరి పిల్లవాడి కష్టాల ఆ పాట మన కళ్ళ ముందు ఇంకా సజీవంగా నిలిచి ఉంది. అణిచివేత నుంచే పోరాటం మొదలవుతుంది. అది పల్లె అయినా పట్నం అయినా.. దోపిడీ ఉన్నప్పుడు శ్రమకు సరైన గుర్తింపు లేనప్పుడు ఉద్యమం ఉప్పెనలా లేస్తుంది . ఈ పోరాటంలో యువతరం పాలు పంచుకుంటే నవయుగం అవతరించడం సాధ్యమౌతుంది. అనే చక్కని సందేశాన్ని అందించిన 'యువతరం శిర మెత్తితే..' అనే పాట 'నవయుగం' చిత్రంలో ఉంది. ప్రజలను చైతన్య పరిచే చిత్రాలు ఈ మధ్య బాగా తక్కువయ్యాయి. అందరు కామెడీ లో హీరో బాబుల భజనల్లో కొట్టుకుపోతున్నారు. ఒక్క నారాయణ మూర్తి మాత్రం ప్రజా సమస్యల మీదనే చిత్రాలు తీస్తున్నారు. ఆయన తీసే ప్రతీ చిత్రం లో ప్రజలను చైతన్య పరచే పాటలు కచ్చితంగా ఉంటాయి. శ్రమ ను గుర్తిస్తే .. శ్రమజీవి కష్టానికి తగిన ప్రతి ఫలం ఇస్తే.. దేశం ప్రగతి సాధిస్తుంది. మన సినిమాలు కూడా అలాంటి ప్రగతి కి మార్గదర్శకాలుగా నిలుస్తాయని ఆశిద్దాం..

No comments:

Post a Comment