Friday 28 February 2014

విభజన అంశంలో ఎత్తులు..! పై ఎత్తులు..!! (చిత్తైంది ఎవరు..?)


మహాభారత యుద్ధంలో శత్రువును ఓడించేందుకు శకుని అమలు చేసిన మాయోపాయాలు అన్నీ ఇన్నీ కావు.. అలాంటి వాడిని పార్లమెంటు సాక్షిగా మైమరిపించారు అభినవ శకునిలు..! రాష్ట్ర విభజన విషయంలో ఆయా పార్టీలు అమలు చేస్తున్న వ్యూహాలకు ప్రత్యర్థులు ప్రతి వ్యూహాలు రచిస్తూ ఔరా అనిపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన ఫలంలో మెజారిటీ వాటా దక్కించుకునేందుకు ఎవరికి వారు చేయని ప్రయత్నం లేదు..! అనుసరించని వ్యూహం లేదు..!! అమలు చేయని ప్రణాళిక లేదు..!!! అయితే.. ఈ పో(ఆ)రాటంలో ఎవరు సక్సెస్ అయ్యారు..? ఎవరు ఫెయిల్యూర్ ను చవి చూశారు..??

సీనియార్టీ చూపించిన కాంగ్రెస్...
దేశాన్ని ఏలేందుకు దశాబ్దాల తరబడి అలవాటు పడ్డ కాంగ్రెస్.. విభజన ఎపిసోడ్ నూ అధికార పీఠాన్ని అందుకునే రాచబాటగా మలుచుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల ద్వారా యువరాజుకు పట్టాభిషేకం జరిపించాలంటే ఆంధ్రప్రదేశ్ విభజన అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్.. ఆ పనికి ఏనాడో సిద్ధపడింది. తెలుగు డైలీ సీరియల్ ను మించిన రీతిలో ఏళ్లతరబడి సాగదీసి, ట్విస్టులు కలగలిపి పార్లమెంటు వరకూ విభజనను తీసుకొచ్చింది. లోక్ సభలో విభజన బిల్లుకు తీవ్ర స్థాయిలో అడ్డంకులు ఎదురు కావడంతో తన సీనియార్టీకి మరింత పదును పెట్టింది. సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పెద్దలు ఒక్కసారిగా అలర్టై, ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశారు. ఇందులో భాగంగా.. ఎప్పటి నుంచో తెలంగాణకు అనుకూలమంటున్న బిజెపి మద్దతు ఇస్తేనే.. టి.బిల్లు పాస్ అవుతుందని, లేకుంటే అంతే సంగతులు అంటూ.. భారతీయ జనతా పార్టీయే రాష్ట్రాన్ని విడగొట్టాల్సి ఉందని జనాల్లోకి సంకేతాలు పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సమయం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశాన్ని క్రెడిట్ గా మార్చేసి దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం ముమ్మరం చేసింది. దీనికోసం.. తమ నుంచి అధికారం లాగేసుకోవాలని ఎదురు చూస్తున్న బిజెపితో ఏకంగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ విందు సమావేశాలు ఏర్పాటు చేశారు. బిజెపి సూచిస్తున్న డిమాండ్లలో కొన్నింటికి ఓకే అనేశారు. ఇక లోక్ సభలో బిల్లుపై చర్చ సాగుతున్న తరుణంలో సీమాంధ్ర ఎంపీలను ఉసిగొల్పడం ద్వారా కాంగ్రెస్ ఎంపీలకు వ్యక్తిగత ఇమేజ్ వచ్చే ఏర్పాటు చేసింది. ఈ వ్యూహంలో భాగమే లగడపాటి పెప్పర్ స్ప్రే. అక్కడ ముగిసిన తర్వాత రాజ్య సభలో కేవీపీ ద్వారా విగ్రహం రూపంలో సమైక్య వాదాన్ని వినిపించే ప్రయత్నం చేసింది. ఈ విధంగా మొత్తం విభజన ఎపిసోడ్ ను తన చుట్టూ తిప్పుకోవాలని చేసిన ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన విజయం సాధించింది.

''ఒక్క దెబ్బ .. రెండు పిట్టలు'' ఇదే బిజెపి వ్యూహం...
''చిన్న రాష్ట్రాలు-బలమైన కేంద్రం'' అనే ఎజెండాతో ముందుకు సాగుతున్న బిజెపికి ఆంధ్రప్రదేశ్ విభజన అంశం.. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్లైంది. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే వ్యూహాన్ని అమలు చేసింది. ఏపీ విభజన ద్వారా దేశాన్ని ముక్కలు చేయాలనే అంశం నెరవేరుతుండడంతోపాటు, దక్షిణ భారత దేశంలోనే కొరకరాని కొయ్యగా మారిన ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా తెలంగాణలో బలపడే ఛాన్స్ వచ్చిందని బిజెపి సంతోషం వ్యక్తం చేసింది. దీంతో తాను సైతం విభజన రాగం ఆలపించడం మొదలు పెట్టింది. విభజన బిల్లు పార్లమెంటకు చేరే నాటికి నానారకాల వ్యాఖ్యానాలతో గందరగోళం సృష్టించిన ఆ పార్టీ.. లోక్ సభలో చర్చ నాటికి తన వ్యూహాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసింది. ఇందులో భాగంగానే వైసిపి వాడి పడేసిన, టిడిపి ఇంకా వాడుతున్న 'సమన్యాయం' బ్రాండ్ ను అందుకుంది. ప్రధానితో విందు సమావేశంలోనూ దీన్ని తెరపైకి తెచ్చింది. చివరకు లోక్ సభలో అధికార పార్టీతో కలిసి 'తెలంగాణ'ను పాస్ చేయించింది. అనంతరం.. తమకూ తెలంగాణ క్రెడిట్ ఇవ్వండి అంటూ తెలంగాణ ప్రజలకు దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు రాజ్యసభను వేదికగా మార్చుకుంది. తద్వారా సీమాంధ్రుల మెప్పు పొందాలనే ఆలోచన చేసింది. ఇందుకోసమే.. విభజన బిల్లుకు లోక్ సభలో సులభంగా మద్దతు తెలిపిన బిజెపి.. రాజ్యసభలో 'సవరణలు' చేయాలంటూ పట్టుబట్టే నాటకానికి తెరలేపింది. ఇందులో పలు సవరణలను సాధించామని కూడా ప్రచారం చేసుకుంటోంది. తద్వారా సీమాంధ్ర ప్రాంతంలోనూ ఎన్నికలకు సులభంగా వెళ్లొచ్చని భావిస్తోంది.

కాంగ్రెస్ కనుసన్నల్లో వైసిపి..
''రాష్ట్ర విభజన మా చేతిలో లేదు.. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే'' అంటూ కొన్ని రోజులు, ''రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలి'' అంటూ మరికొన్ని రోజులు.. ''రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి'' అని ఆ తర్వాత మాటలు మారుస్తూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం లోక్ సభలో తన వ్యూహాన్ని అమలు చేసింది. పరోక్షంగా కాంగ్రెస్ కు సహకరిస్తూ వచ్చింది. రాష్ట్ర శాసన సభలో ఆ పార్టీ సభ్యులు, ప్రెస్ మీట్లు పెట్టి ఆ పార్టీ అధినేత విభజనను ఖండించారు. కానీ.. పైకి సమైక్యమంటూ లోపల విభజనకు సహకరించారని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు పార్లమెంట్ లో సైతం కాంగ్రెస్ కు అనుకూలంగానే వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఇదంతా భవిష్యత్ సమీకరణాల్లో భాగమేనని పలువురు వ్యాఖ్యానించారు.

అరిగిపోయిన పాటనే ఆలపించిన టిడిపి...
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి, దాన్ని వెనక్కు తీసుకోకుండానే విభజన అన్యాయం, ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ వింత వ్యూహాన్ని అమలు చేసిన చంద్రబాబుకు ఆశించిన ఫలితం లభించలేదు. సమన్యాయం చేయాలని ఒక పక్క చెబుతూ.. అసలు సమన్యాయం అంటే ఏంటో వివరించకుండా వ్యవహరించిన బాబు ఉపాయం బెడిసికొట్టింది. సమైక్య ఛాంపియన్ అయ్యేందుకు లోక్ సభలో చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ ఎన్ని రకాల 'వేషాలు' వేసినా రావాల్సిన క్రెడిట్ రాలేదు. ఇదే క్రమంలో పెప్పర్ స్ప్రే ద్వారా లగడపాటి జీరోలాంటి హీరో అవడం ద్వారా జనం దృష్టిని ఆకర్షించారు. ఈ విధానాన్ని తామూ అనుసరించాలని భావించిన ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ రాజ్యసభలో గలాటా సృష్టించారు. కానీ.. అది అనుకున్నంత పేరు తేలేదు. పై పెచ్చు 'వియ్ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్' అంటూ ఛైర్మన్ ఎదుట అడ్డంగా నిలబడి కావాల్సినంత ప్రచారం కాంగ్రెస్ కు తెచ్చి పెట్టాడు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలోనూ తెలుగు దేశం పార్టీకి విభజన వ్యవహారం తలనొప్పినే మిగిల్చింది. తద్వారా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది నాలుగో శకుని టిడిపి పరిస్థితి. ఈ విధంగా ఎవరికి వారు విభజన అంశంపై క్రెడిట్ కొట్టేసేందుకు ఉపాయాలు పన్నారు. కానీ.. కొందరు మెరుగైన ఫలితాలు సాధించగా.. మరికొందరు డీలా పడిపోయారు.

తొలి భాషాప్రయుక్త రాష్ట్రం విభజన..! 29వ రాష్ట్రంగా తెలంగాణ..!!


భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం రెండు ముక్కలైంది.. ఆంధ్రప్రదేశ్ విభజనకు పెద్దల సభకూడా ఆమోదం తెలిపింది.. కాంగ్రెస్, బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల పెద్దల సభలోనూ టి. బిల్లు గట్టెక్కింది. దీంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. గురువారం రాత్రి 8 గంటల 12 నిమిషాల సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిందని ఛైర్మన్ కురినయ్ ప్రకటించారు. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్రవేసే కార్యక్రమం మాత్రమే మిగిలి ఉంది.

బిల్లును వ్యతిరేకించిన సీపీఎం... 
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును సీపీఎంతోపాటు సమాజ్ వాదీ పార్టీ, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, బిజెడి, జెడియూ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల దేశ సమైక్యతకే భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. విభజన వ్యవహారం ఒక్క ఏపీతోఏనే ఆగదని, దేశంలో ఇంకా చాలా ప్రాంతాల నుంచి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని ఆందోళన ప్రకటించాయి. అయినప్పటికీ సభలో ఏకమైన కాంగ్రెస్, బిజెపి టి.బిల్లును పాస్ చేయించేందుకే మొగ్గు చూపాయి.

విభజనకు పట్టుబట్టిన కాంగ్రెస్, బిజెపి...
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని కాంగ్రెస్, బిజెపి పట్టుబట్టాయి. వీటితోపాటు ఎన్ సిపి, సిపిఐ, బిఎస్ పి తదితర పార్టీలు రాష్ట్ర విభజనకు మద్దతునిచ్చాయి.

డివిజన్ పెట్టకపోవడం అప్రజాస్వామికం: ఏచూరి 
విభజన బిల్లుపై క్లాజుల వారీగా ఓటింగ్ పూర్తయిన తర్వాత బిల్లు ఆమోదానికి సంబంధించి డివిజన్ నిర్వహించాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. దీనికి ఛైర్మన్ నిరాకరించారు. సభ ఆర్డర్ లో లేనందువల్ల అది సాధ్యం కాదని చెప్పారు. దీనికి ఏచూరి స్పందిస్తూ ఇంత ముఖ్యమైన అంశంలో డివిజన్ లేకుండా ఆమోదించడం అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఛైర్మన్ నుంచి స్పందన లేకపోవడంతో వాకౌట్ చేస్తున్నట్లు ఏచూరి ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించిందని కురియన్ ప్రకటించారు.

మూజువాణి ఓటు.. ప్రజాస్వామ్యానికి చేటు..?!


''మూజువాణి..'' ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న మాట. ఇదివరకూ చాలా మందికి అంతగా అవగాహన లేని ఈ ఓటింగ్ విధానం.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఇటు రాష్ట్ర అసెంబ్లీలో, అటు పార్లమెంటులో జరిగిన చర్చ ద్వారా అందరికీ తెలిసొచ్చింది. అయితే.. ఈ ఓటింగ్ విధానంపై చర్చ కూడా అదే స్థాయిలో సాగుతోంది. అసలు ఈ ఓటింగ్ విధానం సరైందేనా..? అటు పార్లమెంటులో, ఇటు అసెంబ్లీల్లో మెజార్టీ సభ్యుల అనుమతి లేకుండా ఒక బిల్లును పాస్ చేయించేందుకు దోహదపడుతున్న 'మూజువాణి'తో ప్రజాస్వామ్యానికి మేలుందా..??

మెజార్టీ అనుమతి లేకుండానే టి.బిల్లు పాస్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు విభజన జరగాలంటే.. మరొకరు సమైక్యంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఇరువైపులా ఆందోళనలు సాగాయి. ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశంపై ఒక నిర్ణయం తీసుకునే సమయంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటులో మెజార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండా అధికార పక్షం బిల్లును పాస్ చేయించింది. మొదట లోక్ సభలోనూ, తర్వాత రాజ్య సభలోనూ ఇదే విధంగా బిల్లును గట్టెక్కించింది. తద్వారా.. ఎవరు ఆంధ్రప్రదేశ్ విభజనకు అనుకూలంగా ఉన్నారో..? ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో..?? తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బిజెపితో కుమ్మక్కైన ప్రభుత్వం తన లక్ష్యం నెరవేర్చుకుంది.

రాష్ట్ర అసెంబ్లీలోనూ ఇదే తరహా... 
రాష్ట్రపతి పంపించిన ఆంధ్రప్రదేశ్ పునరవ్యవస్థీకరణ బిల్లు విషయంలోనూ ఇదేవిధంగా జరిగింది. బిల్లును వెనక్కి పంపాలంటూ ముఖ్యమంత్రి హోదాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తిరస్కార నోటీసుపై తెలంగాణ ప్రాంత సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును వెనక్కి పంపడానికి వీల్లేదని సభలో భీష్మించారు. అయినప్పటికీ నోటీసును సభలో ప్రవేశపెట్టిన స్పీకర్ నాదెండ్ల మనోహర్.. ఎలాంటి ఓటింగ్ చేపట్టకుండానే మూజువాణి ఓటు ద్వారా సీఎం తీర్మానం నెగ్గిందని ప్రకటించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజన బిల్లును తిరస్కరించిందని వెల్లడించారు.

ప్రజాస్వామ్యానికి చేటు కాదా..? 
రాష్ట్ర, దేశ ప్రజలను ప్రభావితం చేసే చట్టాలు రూపొందిస్తున్నప్పుడు.. వారికి ప్రతినిధులుగా ఉన్న సభ్యులు మెజార్టీ సంఖ్యలో వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇలాంటి పద్ధతే మేలు చేస్తుంది. కానీ.. మెజారిటీ సభ్యుల అనుమతి లేకుండా.. కనీసం ఎంత మంది అంగీకరిస్తున్నారు..? ఎంత మంది వ్యతిరేకిస్తున్నారనే విషయం తెలియకుండానే ఫలానా బిల్లు ఆమోదం పొందినట్లు ఎలా ప్రకటిస్తారు..? అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఈ ఓటింగ్ విధానంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు.

మనం ఇద్దరం.. మనకు ఐదుగురు..! (హిందూ జంటలు ఐదుగుర్ని కనాలన్న విహెచ్ పి..!!)


ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కాషాయం మతోన్మాదం ఏ స్థాయిలో జడలు విప్పుతోందో.. తెలుసుకోవడానికి చక్కని ఉదాహరణ ఈ వ్యాఖ్యలు..! మతతత్వ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 'హిందూ' కార్డును ఎన్ని రూపాల్లో వీలైతే అన్ని రూపాల్లోనూ జనంలోకి చొప్పించే ప్రయత్నం జరుగుతోంది.. అది ఏ స్థాయిలో ఉందో విశ్వహిందూ పరిషత్ కన్వీనర్ అశోక్ సింఘాల్ మాటలు మన కళ్లకు కడుతున్నాయి..!! భారత దేశంలోని ప్రతి హిందూ జంట ఇక నుంచి ఐదుగురు సంతానాన్ని కనాలట! ఒక్కరిద్దరితో అసలే ఆగిపోకూడదట..!!

ఎందుకంటే..? 
పై వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో అశోక్ సింఘాల్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ కూడా ఇచ్చారు. దేశంలో రోజురోజుకీ హిందువుల సంఖ్య తగ్గిపోతోందట..! ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భారతదేశంలో హిందువులు మైనారిటీ స్థాయికి పడిపోతారట..! ఈ వివరణతో ఆగకుండా ఇతర మతాలపైనా నోరు పారేసుకున్నారు. ఇతర మతస్తులు తమ జనాభాను పెంచుకుంటూ పోతున్నారని చెప్పారు. ఈశాన్య భారతదేశంలో క్రైస్తవులు ముక్తిసేన పేరిట మారణకాండ సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తుపాకులతో బెదిరించి మరీ క్రైస్తవ మతంలోకి దింపుతున్నారని అన్నారు. ఈ కారణాల వల్ల ఇబ్బందుల్లో పడుతున్న హిందూ మతాన్ని రక్షించాలంటే హిందూ దంపతులంతా అలర్ట్ కావాలని ఉద్భోదించారు. ఇక నుంచీ అందరూ ఐదుగురు పిల్లలను కనాలని తేల్చేశారు.

ప్రస్తుత.. జనాభా 120 కోట్ల పైనే..!
ప్రస్తుతం మన దేశ జనాభా నూట ఇరవై కోట్ల పైనే ఉంది. పెరిగిపోతున్న జనాభా కారణంగా ఆహారం, నివాసం, ఉపాధి తదితర అనేక సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇది ఒక్క మనదేశాన్నే కాదు.. అన్ని దేశాలనూ అవస్థల పాల్జేస్తున్న విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఒక జంట ఒక్కరినే కనాలని, తద్వారా దేశ అభివృద్ధికి పాటుపడాలని నిబంధనలు రూపొందిస్తున్నాయి. ఇవన్నీ పట్టించుకోని మతోన్మాధులు.. తమ పబ్బం గడుపుకునేందుకు మతం పేరిట దేశానికి హానిచేసే ప్రకటనలు చేస్తున్నారని లౌకిక వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు 29 రాష్ట్రాలు..! రేపు 50..?! (తెలంగాణతో రేగిన విభజన అలజడి..!)


తెలంగాణ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా విభజన తేనె తుట్టె కదిలిందా..? 
ఇతర ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభజన వాదం ఇకమీదట నిద్రలేవనుందా..?? 
ఇప్పుడు దేశంలో 29 రాష్ట్రాలు.. రేపు..? 
భవిష్యత్ భారతం ఎన్ని ముక్కలు కాబోతోంది..? 
అమెరికాను యుఎస్ఏ అన్నట్లు.. ఇండియాను యుఎస్ఐ అనాల్సిన పరిస్థితి దాపురిస్తుందా..? ఏం జరగబోతోంది..??
         పేరుకు దేశం..! కానీ.. రాష్ట్రానికో రాజ్యాంగం.. ఎవడి పాలన వాడిదే.. ఎవడి గోల వాడిదే..! ఇదీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పరిస్థితి..!! భవిష్యత్ లో భారత దేశానికి ఈ పరిస్థితి రాబోతోందా..? అనే అనుమానాలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇతర ప్రాంతాల్లో సైలెంట్ గా ఉన్న విభజన వాదం వాయిస్ పెంచుతోంది. తామూ వెనకబడ్డామనో, తమ ఆత్మగౌరవం కోసమనో.. ఏదో ఒక కారణం చెబుతూ తమకు ప్రత్యేక రాష్ట్రం కేటాయించాలనే ప్రాంతాలు ఇప్పుడు దేశ సమైక్యతకు సవాలు విసురుతున్నాయి. తమకూ ప్రత్యేక రాష్ట్రం కావాలని మరో 21 ప్రాంతాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఈ ప్రాంతాలన్నీ 'మా సంగతేంటి..?' జెండా కర్రలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం కోరుతున్న ప్రాంతాలివే.. 
1. బీహార్, జార్ఖండ్ లలో మైథిలీ భాష మాట్లాడే ప్రాంతాల వారు 'ప్రత్యేక మిథిలాంచల్' కోరుతున్నారు.
2. అస్సాం, నాగాలాండ్ లో నివసించే దిమాసా ప్రజలకు 'దిమాలాండ్..'
3. పశ్చిమ బెంగాల్ లో కూచ్ బేహార్, జల్ఫాయ్ గురిలతో పాటు మరి కొన్ని జిల్లాలతో 'కామ్తాపూర్'
4. బెంగాల్ లో డార్జిలింగ్ పరిసర ప్రాంతాలతో 'గూర్ఖాలాండ్'
5. ఒడిషాలోని కొన్ని జిల్లాలు, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాలతో 'కోసల్ '
6. మణిపూర్ కుకీ గిరిజనులు నివసించే ప్రాంతాలతో 'కుకీలాండ్'
7. మేఘాలయ లోని గారో ప్రాంతాలను కలిపి 'గారోలాండ్'
8. కర్ణాటక రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక 'కూర్గ్'
9. కర్ణాటక-కేరళ సరిహద్దు ప్రాంతాలతో 'తుళునాడు'
10. కొంకణి భాష మాట్లాడే వారితో 'కొంకణ్'
11. ఉత్తర ప్రదేశ్ ను నాలుగు భాగాలు చేయాలనే డిమాండ్ ఉంది. ఇందులో ఒకటి 'పూర్వాంచల్'
12. రెండోది 'అవథ్ ప్రదేశ్'
13. మూడోది 'బుందేల్ ఖండ్'
14. నాలుగోది 'పశ్చిమాంచల్' (లేదా) 'హరిత ప్రదేశ్'
15. అసోంలోని బోడో ప్రాబల్య ప్రాంతాలతో 'బోడోలాండ్'
16. అసోంలోని కర్బీ గిరిజన ప్రజలు నివసించే ప్రాంతాలతో 'కర్బీ ఆంగ్లాం'
17. మహారాష్ట్రలో 'విదర్భ'
18. గుజరాత్ లో 'సౌరాష్ట్ర'
19. జమ్మూ కాశ్మీర్ లోని లఢఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్
20. యూపీలోని ఆగ్రా, అలీగఢ్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోని భరత్ పూర్, గ్వాలియర్ జిల్లాలతో 'బ్రజ్ ప్రదేశ్'
21. ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాలు కలిపి 'భోజ్ పూర్'

భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం అసాధారణ పోరాటం... 
దేశంలోని రాష్ట్రాలన్నీ భాష ప్రాతిపదికన ఏర్పడాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆంగ్లేయుల పాలనా కాలంలోఅసాధారణ పోరాటం సాగింది. బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి ఒక భాష మాట్లాడే వారంతా ఒకే ప్రాంతంలో ఉంచాలన్న నినాదంతో ఉవ్వెత్తున ఉద్యమం నడిచింది. ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ ఈ పోరాటానికి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. అయితే.. ''విభజించు - పాలించు'' సూత్రాన్ని ఆంగ్లేయుల నుంచి పూర్తిస్థాయిలో వంటబట్టించుకున్న కాంగ్రెస్.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాన్ని తు.చ. తప్పకుండా పాటించింది. ఇందులో భాగంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. దీంతో.. అవిభక్త కమ్యూనిస్టు పార్టీతోపాటు, పొట్టి శ్రీరాములు లాంటి వారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం సాగించారు. ఆ పోరాట ఫలితంగానే దేశ వ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

తెలంగాణతో రేగిన అలజడి... 
ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఉన్నప్పటికీ కొంతకాలంగా సైలెంట్ గా ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన తీవ్రతరం అయిన నాటి నుంచి ఆయా ప్రాంతాలన్నీ నిశితంగా పరిశీలిస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోతే.. తామూ రంగంలోకి దూకాలని నిర్ణయించాయి. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో.. ''వారికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు..?'' అనే ప్రశ్నతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రాతిపదిక ఏంటి..? 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ముక్కలు చేసింది. కానీ.. దీనికి తగిన ప్రాతిపదిక ఏంటి..? అని ప్రశ్నిస్తే మాత్రం మూడు రకాల సమాధానాలు వినిపిస్తాయి...
60 ఏళ్ల డిమాండ్ : ఆరు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాం అని కాంగ్రెస్ పెద్దలు, మేమూ అందుకే మద్దతిచ్చామని బిజెపి నేతలు చెప్పుకొచ్చారు.
వెనకబడిన తెలంగాణ : అభివృద్ధి విషయంలో పాలకులు తెలంగాణ పట్ల వివక్ష చూపించారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోరామని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు.

డిమాండ్ పురాతనమైతే రాష్ట్రం ఇస్తారా..? 
కాంగ్రెస్ అధిష్టానం, బిజెపి నేతల ప్రకారం ప్రత్యేక డిమాండ్ చాలా కాలంగా ఉంటే రాష్ట్రం ఇచ్చేస్తారన్నమాట! ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రాతిపదిక ఇదేనా..? కాదు.. వెనుకబాటే ప్రాతిపదిక అంటే.. దేశంలో సగానికి పైగా ప్రాంతాలన్నీ తీవ్ర దారిద్ర్యంతో బాధపడుతున్నాయి. రేపు ఇవన్నీ ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుకుంటే ఇచ్చేస్తారా..?? ఆ మాట కొస్తే ఇటు రాష్ట్రాన్ని, అటు దేశాన్ని 60 ఏళ్ల స్వాతంత్ర్య కాలంలో 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత స్థానంలో ఉన్న బిజెపి పార్టీలే వెనకబాటుకు సమాధానం చెప్పాలి. ఈ వాస్తవాలన్నీ దాచిపెట్టి, కేవలం రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం రాష్ట్రాన్ని నిలువునా చీల్చేశారు.

తేనె తుట్టె కదిపిన కాంగ్రెస్, బిజెపి... 
దేశంలోని చాలా అనర్థాలన్నింటికీ కారణమైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు .. సరైన ప్రాతిపదిక లేకుండా ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టాయి. పార్లమెంటు సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని విభజన రాజకీయాలు నడిపారు. తద్వారా దేశంలోని వెనుకబడిన ప్రాంతాల తేనె తుట్టెను కదిపారు. అవి ఏ మలుపు తీసుకుంటాయి..? దేశ స్థిరత్వంపై ఎలాంటి దాడి చేయబోతున్నాయి..?? అనే దానికి కాలం సమీప భవిష్యత్ లోనే సమాధానం చెపుతుంది.

ఆకారమే సైకిల్.. స్పీడ్ మాత్రం బుల్లెట్..! (రెండు రాష్ట్రాల్లో టిడిపిదే అధికారమట..!)


''జీవితమే ఒక ఆట.. సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్లు ఉండవు మీకు కన్నీళ్లూ.. అనాథలైనా, అభాగ్యులైనా అంతా నావాళ్లు.. ఎదురే నాకు లేదు. నన్నెవరూ ఆపలేరు..''
ఈ పల్లవితో తెలుగు సినిమాలో ఒక ఫేమస్ పాట ఉంది. ఆల్ మోస్ట్ ఈ పాటను అదే ట్యూన్ తో, కేవలం లిరిక్స్ మార్చి పాడేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు..! వచ్చే ఎన్నికల్లో 'నా సైకిల్ స్పీడును ఎవరూ ఆపలేరు.. ఆకారమే సైకిల్, స్పీడ్ మాత్రం బుల్లెట్' అంటూ డైలాగులు పేల్చేశారు. ఇంతటితో ఆగలేదు సరికదా.. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో, కనీవినీ ఎరుగని రీతిలో విజయ దుందుభి మోగిస్తుందని అనేశారు. 'కాచుకోండి నా దెబ్బ.. పైనా కిందా అబ్బ'అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అధినేత ఆవేశపూరిత ప్రసంగానికి.. తప్పని పరిస్థితుల్లో తమ్ముళ్ల రెండు చేతులు ఒక్కటై చప్పుడు చేశాయే తప్ప, మనసు మాత్రం మౌనంగా నిట్టూర్చి ఉంటుంది.

సీమాంధ్రలో గెలిచేదెలా..?
ఆంధ్రప్రదేశ్ విభజనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ కూడా ప్రధాన కారణం అనే విషయాన్ని ఇటు కాంగ్రెస్, అటు వైసిపి జనాల్లోకి బాగానే తీసుకెళ్లాయి. తద్వారా విభజనకు కారణమైన ప్రధాన ముద్దాయిల్లో టిడిపి కూడా నిలబడాల్సి వచ్చింది. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత తొందరపడ్డ చంద్రబాబు రాజధాని నిర్మాణం, ఖర్చు , పద్దులు అంటూ చిన్నపాటి చిట్టా ప్రకటించి నాలుక్కర్చుకున్నారు. సీమాంధ్ర ఉద్యమం తీవ్రత తెలుసుకుని ఢిల్లీ సాక్షిగా దీక్ష చేసినా ఫలితం ఇసుమంతైనా కనిపించలేదు. విభజన చివరి దశలో ఉండగా.. దేశపర్యటన చేసినప్పటికీ ఒరిగింది శూన్యమే. అంతేకాకుండా.. విభజన నిర్ణయం తీసుకున్న దగ్గర్నుంచి, పూర్తయ్యే దాకా.. 'ఇరు ప్రాంతాలకు సమన్యాయం' అనే మాట తప్ప, 'రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి' అనే డిమాండ్ మాత్రం ఒక్కసారి కూడా అన్నపాపాన పోలేదు. మరోవైపు సీమాంధ్రలో జగన్ ప్రభావం ఎలాగూ ఉండనే ఉంది. పైపెచ్చు.. తొలుత సమన్యాయం అన్న వైసిపి, ఆ తర్వాత పూర్తిగా సమైక్యాంధ్ర స్టాండ్ ను ప్రదర్శించి మార్కులు కొట్టే ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్ తన మార్కు రాజకీయాన్ని అంతో ఇంతో తప్పక ప్రదర్శిస్తుంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు టిడిపిని సీమాంధ్ర ప్రజలు ఎలా గెలిపిస్తారు..? తమకు విజయం ఎలా దక్కుతుంది..?? అని తమ్ముళ్లు మనోవేదనకు గురవుతున్నారు.

తెలంగాణలో ఉదయించేదెలా..?
ఇక తెలంగాణ విషయానికి వస్తే పరిస్థితి మరింత దిగజారినట్లే ఉంది. మంత్రి పదవి దక్కనందుకు బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్.. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబునే ప్రధానంగా టార్గెట్ చేశారు. తెలంగాణకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అంటూ బాగానే ప్రచారం సాగించారు. బాబు తెలంగాణ వ్యతిరేకి అనే ప్రచారం జనాల్లోకి కూడా తీవ్రంగానే వెళ్తోందన్న విషయాన్ని గమనించిన టిడిపి అధినేత.. తప్పని పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలం అంటూ కేంద్రానికి లేఖ ఇచ్చారు. అయినప్పటికీ దానికి తగిన ఫలితం రాలేదనే చెప్పాలి. కారణం.. మళ్లీ చంద్రబాబు తీసుకున్న స్టాండే! ఇక్కడ కూడా సమన్యాయం పాట పాడడంతో.. ప్రత్యర్థులు మళ్లీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ రావడం బాబుకు ఇష్టం లేదు అంటూ ప్రచార పర్వం కొనసాగించారు. విభజన చివరి దశలో బాబు చేసిన దేశ పర్యటన తెలంగాణను అడ్డుకోవడానికే అన్నట్టు ఇక్కడి ప్రత్యర్థులు చిత్రించారు. మొదటి నుంచి చివరి వరకు సమన్యాయం గానం ఆలపించిన బాబు.. సమన్యాయం అంటే ఏంటో చెప్పకుండానే విభజన పూర్తయ్యింది. ఈ విధంగా.. రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకోవాలనే ధోరణితో బాబు తీసుకున్న అస్పష్టమైన నిర్ణయం ఇరువైపులా పార్టీని ఇబ్బందుల్లో పడేసిందే తప్ప, మేలు చేయలేదనేది విశ్లేషకుల మాట. మరి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ టిడిపి విజయం సాధిస్తుందన్న అధినేత మాటలను అర్థం చేసుకుని, జీర్ణించుకునేందుకు తమ్ముళ్లు కాస్త ఇబ్బంది పడ్డట్టే అనిపించిందని పేర్కొంటున్నారు.

మమత సంచిలో అన్నా హజారే..! (ఎప్పుడు..? ఎందుకు..? ఎలా..?)


అవినీతి రహిత సమాజం కావాలని ఉద్యమించి, అభినవ గాంధీగా పేరుగాంచిన వ్యక్తి అన్నా హజారే. జన లోక్ పాల్ బిల్లు తేవాలని పోరాటం సాగించి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.. తన ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగుతుందని, ఏ పార్టీకీ తాను మద్దతు ఇవ్వబోనని చాటిచెప్పారు. అయితే.. అదంతా ఇప్పుడు గతం. ఆయన సాగించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చల్లబడినట్లుగానే.. ఆయన చెప్పిన మాటలు కూడా చెల్లని కాసులు అయిపోతున్నాయి. ఇందుకు.. మమతా బెనర్జీ పంచన చేరడమే ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయాలకు దూరం దూరం అంటూ వచ్చిన అన్నా.. ఇప్పుడు ఏకంగా.. వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఇందుకు ఆయన చూపుతున్న కారణాలు ఏంటంటే..? ''మమతా బెనర్జీ చాలా సాదాసీదాగా ఉంటారు.. ప్రభుత్వ భవనాల్లో నివసించట్లేదు. కాటన్ చీరలే కట్టుకుంటున్నారు.. ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి నేతలే.. అందుకే మమతకు మద్దతు ఇస్తున్నా...'' అంటూ మీడియా ఎదుట ఊదేశారు. కానీ.. నిజమైన కారణాలు ఇవేనా..? ఆమె బాహ్య నడవడికను చూసే హజారే మద్దతిస్తున్నారా..?? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా..???

'సాదాసీదా' అయితే.. రావాల్సింది ఇక్కడికి...
అన్నా హజారే తృణమూల్ కు మద్దతు ఇవ్వడానికి, సీఎం హోదాలో మమత చూపిస్తున్న సాదాసీదా వ్యక్తిత్వమే కారణమైతే.. హజారే మొదట వెళ్లాల్సింది మమత వద్దకు కాదు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వద్దకు. నాలుగు పర్యాయాలు త్రిపుర రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయినప్పటికీ.. కనీసం సొంత ఇల్లు కూడా లేని మాణిక్ సర్కార్ వద్దకు వెళ్లాలి. సీఎం పదవిలో ఉన్నందుకు నెలకు ఆయనకు వచ్చే వేతనాన్ని మొత్తం పార్టీకే ఇచ్చేస్తూ.. అందులోంచి కేవలం 5 వేల రూపాయలు మాత్రమే తన ఖర్చులకు వాడుకుంటున్న సర్కార్ వద్దకు హజారే వెళ్లాలి. ''దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి'' అంటూ అన్ని రకాల మీడియా నెత్తికెత్తుకున్న మాణిక్ వద్దకు వెళ్లకుండా.. మమత వద్దకే వెళ్లడంలో ఆంతర్యం ఏంటో అంతుబట్టకుండా ఉంది.

మమత పాలనలో అరాచకాలు కనిపించట్లేదా..?
మమతా బెనర్జీలో మెరుగైన నాయకత్వ లక్షణాలుకనిపించిన అన్నా హజారేకు బెంగాల్లో జరుగుతున్న దారుణాలు కనిపించకపోవడం మరీ విడ్డూరం. మహిళలపై రోజూ సాగుతున్న అత్యాచార కాండ, పసిపిల్లల మరణాలు, ప్రతిపక్షాలపై తృణమూల్ ప్రత్యక్ష దాడులు ఇవన్నీ అగుపించట్లేదా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటీవల బీర్భూమ్ జిల్లాలో ఒక మహిళపై 12 మంది సామూహిక అత్యాచారం చేశారు. అదికూడా.. తృణమూల్ నేత ఆదేశాలతోనే! ఇవేవీ అన్నాకు కనిపించకపోవడం ఆశ్చర్యం.

మోడీ రాయబారిగా హజారే..?
అన్నాహజారే వ్యవహార శైలిని పూర్తిగా గమనించిన వారు.. మోడీకి మేలు చేయాలనే ఉద్దేశంతోనే మమత వద్దకు వెళ్లినట్లు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల ద్వారా ఎలాగైనా ప్రధాని పీఠం దక్కించుకోవాలని చూస్తున్న మోడీకి.. థర్డ్ ఫ్రంట్ కునుకు పట్టనీయట్లేదు. దీంతో.. అవకాశం ఉన్న పార్టీలన్నింటినీ తనవైపు తిప్పుకోవాలని మోడీ భావిస్తున్నారు. బెంగాల్ లో విరోధులుగా ఉన్న కమ్యూనిస్టులతో ఎలాగూ థర్డ్ ఫ్రంట్ లోకి మమత వెళ్లే ప్రసక్తే లేదుగనుక ఎన్డీఏలోకి రప్పించుకోవాలని మోడీ పథకం పన్నారు. ఇందులో భాగంగానే కోల్ కతాలో ప్రసంగించిన సమయంలో మోడీ మమత ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈ నేపథ్యంలో హజారేను మమత పార్టీ తరపున ప్రచారం చేయించడం ద్వారా అటు బెంగాల్ లో కమ్యూనిస్టులను, తద్వారా థర్డ్ ఫ్రంట్ ను దెబ్బతీయడంతోపాటు, ఎన్డీఏకు తృణమూల్ మద్దతు సాధించవచ్చనే ప్లాన్ మోడీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్లాన్ మొత్తాన్ని పక్కాగా అమలు జరిపే బాధ్యతను అన్నా హజారేకు అప్పగించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే 'నాన్ పాలిటిక్స్ ' నుంచి 'ప్యూర్ పాలిటిక్స్' కు హజారే మారిపోయాడనే విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే.. ఒకనాటి తన సహచరుడు, ఇప్పటి ఆప్ అధినేత కేజ్రీవాల్ కు సైతం హజారే దూరమయ్యాడని పేర్కొంటున్నారు. 'ఆప్' ద్వారా కేజ్రీవాల్ బిజెపికి గండికొట్టారని, ఇది జీర్ణించుకోలేకే.. హజారే అతనితో తెగదెంపులు చేసుకున్నాడని చెబుతున్నారు. నిత్యం హజారే వెనకుండే కిరణ్ బేడీ తాను మోడీకే ఓటు వేస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఏదిఏమైనా.. మోడీకి మేలు చేసేందుకు మమత పంచన చేరిన హజారే.. తద్వారా బెంగాల్ లో కమలం ఉనికిని, మతోన్మాదాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

గంగూలీని బెదిరించిన సచిన్..! (గ్రౌండ్ చుట్టూ రౌండ్లు కొట్టిన సౌరవ్)


భారత క్రికెట్ లోనే కాకుండా ప్రపంచ క్రికెట్ లో సచిన్ స్థానం ఎవరెస్ట్. ఈ విషయం ఎవరూ కాదనలేని సత్యం. అయితే.. కెరీర్లో ఎవ్వరూ అందుకోలేని రికార్డులను తన ఖాతాలో లిఖించుకున్న మాస్టర్.. కెప్టెన్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అతని కెప్టెన్సీలో గతంలో ఓసారి టీమిండియా విండీస్ కు వెళ్లింది. ఆ పర్యటనలో మూడో టెస్టులో 38 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో.. టీం సభ్యులపై సచిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట..! ఈ నేపథ్యంలో.. 'ఇప్పుడు ఏం చేయమంటావు సచిన్?' అంటూ గంగూలీ ప్రశ్నించాడట. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న సచిన్.. 'రేపు ఉదయాన్నే లేచి గ్రౌండ్ చుట్టూ రౌండ్లు కొట్టు' అని ఆదేశించాడట! కానీ.. అప్పటికే జట్టులో ప్రధాన సభ్యుల జాబితాలో ఉన్న గంగూలీ.. 'సరేగని పోవోయ్..' అన్నట్టు వ్యహరించి తర్వాతి రోజు హోటల్ గదికే పరిమితమయ్యాడు. దీంతో.. తన ఆదేశాలు పాటించలేదని మరింత కోపం తెచ్చుకున్న సచిన్.. టూర్ మధ్యలోనే సౌరవ్ ను భారత్ కు పంపేయాలని నిర్ణయించుకున్నాడట! అదే జరిగితే తన కెరీర్ కు బ్రేక్ పడుతుందని భావించిన దాదా... మరుసటి రోజు ఉదయాన్నే కాళ్ళకు షూ తగిలించుకుని మైదానం చుట్టూ పరుగులు పెట్టాడట. ఈ విషయం ఇప్పుడెలా బయట పడిందనేగా మీ సందేహం..? ఆనాటి ఘటనను గంగూలీ ఓ పుస్తకంలో పేర్కొన్నాడు. అందులో... కెప్టెన్ ఆజ్ఞను పాటించకపోవడం తన తప్పేనని ఒప్పుకున్న దాదా.. సచిన్ తాను మాట వినలేదన్న కోపంలో రాయడానికి వీల్లేని భాషలో హెచ్చరించాడని వెల్లడించాడు.

తాజ్ మహల్ ను నేరుగా చూడండి.. (ఆగ్రా వెళ్లకుండానే..!)



''తాజ్ మహల్'' ఈ పేరు వినగానే మనసులో ఎక్కడో.. ఏదో తెలియని తుళ్లింత కలుగుతుంది. అలాంటిది.. నేరుగా తాజ్ మహల్ ను దగ్గర్నుంచి చూస్తే.. కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మనసున కలిగే పరవశం ఊహకు అందనిది. అలాంటి అద్భుత సౌందర్యాన్ని వీక్షించే అదృష్టం ఆగ్రా వెళ్లిన వారికి మాత్రమే దక్కుతుంది. అయితే.. ఆగ్రా వెళ్లలేని వారికి గూగుల్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. 'గూగుల్ స్ట్రీట్ వ్యూ 'ద్వారా.. తాజ్ మహల్ అందాన్ని 360 డిగ్రీల కోణాల్లో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. దీని ద్వారా మనం నేరుగా తాజ్ మహల్ ను చూసిన అనుభూతి కలుగుతోంది. ఈ విధంగా ఒక్క తాజ్ మహల్ నే కాకుండా ఈఫిల్ టవర్, అమేజాన్ నది, వెనిస్ నగరం, నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం వంటివి మొత్తం 57 అద్భుత ప్రాంతాలను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం.. 'google street view'ను క్లిక్ చేయండి. ఆయా ప్రాంతాలను నేరుగా చూసిన అనుభూతిని పొందండి..

హీరో నెంబర్ 7 (మెగా ఫ్యామిలీ పేరు నిలబెడతాడా..?)


హీరో నెంబర్ 7... మెగా ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేయబోతున్న వరుణ్ తేజ్ నెంబర్ ఇది. మెగా స్టార్ నుంచి మొదలు నిన్నటి సాయి ధరమ్ తేజ్ వరకు మొత్తం ఆరుగురు హీరోలు మెగా కుటుంబం నుంచి వచ్చారు. ఈ సంఖ్యలో విజయం పాళ్లే ఎక్కువ. అయితే.. ఏడో నెంబర్ గా రాబోతున్న వరుణ్ తేజ్ ఎలాంటి ట్రాక్ రికార్డును నమోదు చేస్తాడోనని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రారంభమైన వరుణ్ డెబ్యూ మూవీ లాంఛ్ రామానాయుడు స్టూడియోలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోపాటు, సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... తమ కుంటుంబం నుంచి వచ్చిన అందరి హీరోలను ఆదరించినట్లుగానే.. వరుణ్ కు సైతం అండగా నిలవాలని అభిమానులను కోరారు. అయితే.. ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ.. పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఎన్నో అంచనాల నడుమ వస్తున్న వరుణ్ తేజ్ మెగా వారసత్వాన్ని నిలుపుతాడా..? లేదా..? అనేది సినిమా విడుదలయ్యాకే తేలుతుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Sunday 23 February 2014

ఆకారమే సైకిల్.. స్పీడ్ మాత్రం బుల్లెట్..! (రెండు రాష్ట్రాల్లో టిడిపిదే అధికారమట..!)


''జీవితమే ఒక ఆట.. సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్లు ఉండవు మీకు కన్నీళ్లూ.. అనాథలైనా, అభాగ్యులైనా అంతా నావాళ్లు.. ఎదురే నాకు లేదు. నన్నెవరూ ఆపలేరు..''    ఈ పల్లవితో తెలుగు సినిమాలో ఒక ఫేమస్ పాట ఉంది. ఆల్ మోస్ట్ ఈ పాటను అదే ట్యూన్ తో, కేవలం లిరిక్స్ మార్చి పాడేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు..! వచ్చే ఎన్నికల్లో 'నా సైకిల్ స్పీడును ఎవరూ ఆపలేరు.. ఆకారమే సైకిల్, స్పీడ్ మాత్రం బుల్లెట్' అంటూ డైలాగులు పేల్చేశారు. ఇంతటితో ఆగలేదు సరికదా.. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో, కనీవినీ ఎరుగని రీతిలో విజయ దుందుభి మోగిస్తుందని అనేశారు. 'కాచుకోండి నా దెబ్బ.. పైనా కిందా అబ్బ'అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అధినేత ఆవేశపూరిత ప్రసంగానికి.. తప్పని పరిస్థితుల్లో తమ్ముళ్ల రెండు చేతులు ఒక్కటై చప్పుడు చేశాయే తప్ప, మనసు మాత్రం మౌనంగా నిట్టూర్చి ఉంటుంది.  సీమాంధ్రలో గెలిచేదెలా..?    ఆంధ్రప్రదేశ్ విభజనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ కూడా ప్రధాన కారణం అనే విషయాన్ని ఇటు కాంగ్రెస్, అటు వైసిపి జనాల్లోకి బాగానే తీసుకెళ్లాయి. తద్వారా విభజనకు కారణమైన ప్రధాన ముద్దాయిల్లో టిడిపి కూడా నిలబడాల్సి వచ్చింది. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత తొందరపడ్డ చంద్రబాబు రాజధాని నిర్మాణం, ఖర్చు , పద్దులు అంటూ చిన్నపాటి చిట్టా ప్రకటించి నాలుక్కర్చుకున్నారు. సీమాంధ్ర ఉద్యమం తీవ్రత తెలుసుకుని ఢిల్లీ సాక్షిగా దీక్ష చేసినా ఫలితం ఇసుమంతైనా కనిపించలేదు. విభజన చివరి దశలో ఉండగా.. దేశపర్యటన చేసినప్పటికీ ఒరిగింది శూన్యమే. అంతేకాకుండా.. విభజన నిర్ణయం తీసుకున్న దగ్గర్నుంచి, పూర్తయ్యే దాకా.. 'ఇరు ప్రాంతాలకు సమన్యాయం' అనే మాట తప్ప, 'రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి' అనే డిమాండ్ మాత్రం ఒక్కసారి కూడా అన్నపాపాన పోలేదు. మరోవైపు సీమాంధ్రలో జగన్ ప్రభావం ఎలాగూ ఉండనే ఉంది. పైపెచ్చు.. తొలుత సమన్యాయం అన్న వైసిపి, ఆ తర్వాత పూర్తిగా సమైక్యాంధ్ర స్టాండ్ ను ప్రదర్శించి మార్కులు కొట్టే ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్ తన మార్కు రాజకీయాన్ని అంతో ఇంతో తప్పక ప్రదర్శిస్తుంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు టిడిపిని సీమాంధ్ర ప్రజలు ఎలా గెలిపిస్తారు..? తమకు విజయం ఎలా దక్కుతుంది..?? అని తమ్ముళ్లు మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో ఉదయించేదెలా..?    ఇక తెలంగాణ విషయానికి వస్తే పరిస్థితి మరింత దిగజారినట్లే ఉంది. మంత్రి పదవి దక్కనందుకు బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్.. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబునే ప్రధానంగా టార్గెట్ చేశారు. తెలంగాణకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అంటూ బాగానే ప్రచారం సాగించారు. బాబు తెలంగాణ వ్యతిరేకి అనే ప్రచారం జనాల్లోకి కూడా తీవ్రంగానే వెళ్తోందన్న విషయాన్ని గమనించిన టిడిపి అధినేత.. తప్పని పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలం అంటూ కేంద్రానికి లేఖ ఇచ్చారు. అయినప్పటికీ దానికి తగిన ఫలితం రాలేదనే చెప్పాలి. కారణం.. మళ్లీ చంద్రబాబు తీసుకున్న స్టాండే! ఇక్కడ కూడా సమన్యాయం పాట పాడడంతో.. ప్రత్యర్థులు మళ్లీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ రావడం బాబుకు ఇష్టం లేదు అంటూ ప్రచార పర్వం కొనసాగించారు. విభజన చివరి దశలో బాబు చేసిన దేశ పర్యటన తెలంగాణను అడ్డుకోవడానికే అన్నట్టు ఇక్కడి ప్రత్యర్థులు చిత్రించారు. మొదటి నుంచి చివరి వరకు సమన్యాయం గానం ఆలపించిన బాబు.. సమన్యాయం అంటే ఏంటో చెప్పకుండానే విభజన పూర్తయ్యింది.    ఈ విధంగా.. రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకోవాలనే ధోరణితో బాబు తీసుకున్న అస్పష్టమైన నిర్ణయం ఇరువైపులా పార్టీని ఇబ్బందుల్లో పడేసిందే తప్ప, మేలు చేయలేదనేది విశ్లేషకుల మాట. మరి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ టిడిపి విజయం సాధిస్తుందన్న అధినేత మాటలను అర్థం చేసుకుని, జీర్ణించుకునేందుకు తమ్ముళ్లు కాస్త ఇబ్బంది పడ్డట్టే అనిపించిందని పేర్కొంటున్నారు.

Thursday 13 February 2014

ఈరోజు.. పార్లమెంటులోకి కత్తులు.. పెప్పర్ స్ర్పే.. మరి రేపు..?

http://www.10tv.in/news/national/Knives-and-Pepper-Spray-in-Parliament-today-Tomorrow-30899
  భారత పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు..! నిండు సభలో ప్రజాప్రతినిధులు తమను తాము మరచిపోయి.. కత్తులు, హానికర వాయువులతో హల్ చల్ చేశారు..!! స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సభా మర్యాదను ఖూనీ చేశారు..!!! ఇది దేనికి సంతకేతం..? ఈ రోజు కత్తి, పెప్పర్ స్ర్పే ప్రత్యక్షమైన సభలో రేపు ఏం
కనిపించబోతున్నాయి..?? అంతిమంగా.. సభ్యుల ప్రవర్తన భావి తరాలకు ఏం నేర్పిస్తోంది..???
పెప్పర్ స్ర్పే చేసిన లగడపాటి... 
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెడుతున్న సందర్భంలో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఒక అడుగు ముందుకేసి స్పీకర్ పై పెప్పర్ స్ప్రే చేశారు. దీనితో సభలో ఘాటైన వాసన రావడంతో పలువురు ఎంపీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సభలోకి కత్తితో వచ్చారని పలువురు వ్యాఖ్యానించారు. దీనిపై మోదుగుల స్పందిస్తూ తాను కత్తితో రాలేదని, స్పీకర్ మైకు విరిచానని, అది కత్తిలా కనిపించిందని చెప్పారు.
బాహా బాహీకి దిగిన ఎంపీలు...  
  విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ మూజువాణి పద్ధతిలో అనుమతి తీసుకున్నారు. దీంతో వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు ఆందోళనకు దిగారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనల మధ్యే హోం మంత్రి షిండే బిల్లును చదివే తతంగం ముగించారు. ఈ క్రమంలోనే సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. లోక్సభ సెక్రటరీ బల్లపై ఉన్న ఫైళ్లను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చిందరవందరగా పడేశారు. స్పీకర్‌ వద్ద మైకులను తొలగించేందుకు ప్రయత్నించగా, తెలంగాణ ఎంపీలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు ప్రాంత ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే.. లగడపాటి పెప్పర్ స్ర్పే చేశారు. దీంతో.. రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై తెలంగాణ ఎంపీలు పిడిగుద్దులు కురిపించారు. భవిష్యత్ లో ఏం జరగబోతోంది..?    ఏ ప్రాంతం వారైనా కావచ్చు.. సమస్య ఏదైనా కావచ్చు.. తమకు అభ్యంతరం ఉన్న అంశాలపై సభలో చర్చించాల్సిన ఎంపీలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే.. ఉపయోగం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ స్థాయిని మరచి పోయి అప్రజాస్వామిక రీతిలో వ్యవహరించిన వారు.. భవిష్యత్ భారత పౌరులకు ఏం నేర్పుతున్నారని నిలదీస్తున్నారు. ఈ రోజు నిండు సభలోకి నిషేధమైన వస్తువులతో వచ్చిన వారు.. రేపు ఎలాంటి వాటిని తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. సభా మర్యాదలు పాటించడంలో కనీస ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్న వీరు ప్రజాప్రతినిధులుగా ఉండజాలరని పేర్కొంటున్నారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.

see more at:
http://www.10tv.in/news/national/Knives-and-Pepper-Spray-in-Parliament-today-Tomorrow-30899
 

for more news brows :
 - www.10tv.in


- Media10 team