Sunday 23 February 2014

ఆకారమే సైకిల్.. స్పీడ్ మాత్రం బుల్లెట్..! (రెండు రాష్ట్రాల్లో టిడిపిదే అధికారమట..!)


''జీవితమే ఒక ఆట.. సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్లు ఉండవు మీకు కన్నీళ్లూ.. అనాథలైనా, అభాగ్యులైనా అంతా నావాళ్లు.. ఎదురే నాకు లేదు. నన్నెవరూ ఆపలేరు..''    ఈ పల్లవితో తెలుగు సినిమాలో ఒక ఫేమస్ పాట ఉంది. ఆల్ మోస్ట్ ఈ పాటను అదే ట్యూన్ తో, కేవలం లిరిక్స్ మార్చి పాడేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు..! వచ్చే ఎన్నికల్లో 'నా సైకిల్ స్పీడును ఎవరూ ఆపలేరు.. ఆకారమే సైకిల్, స్పీడ్ మాత్రం బుల్లెట్' అంటూ డైలాగులు పేల్చేశారు. ఇంతటితో ఆగలేదు సరికదా.. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో, కనీవినీ ఎరుగని రీతిలో విజయ దుందుభి మోగిస్తుందని అనేశారు. 'కాచుకోండి నా దెబ్బ.. పైనా కిందా అబ్బ'అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అధినేత ఆవేశపూరిత ప్రసంగానికి.. తప్పని పరిస్థితుల్లో తమ్ముళ్ల రెండు చేతులు ఒక్కటై చప్పుడు చేశాయే తప్ప, మనసు మాత్రం మౌనంగా నిట్టూర్చి ఉంటుంది.  సీమాంధ్రలో గెలిచేదెలా..?    ఆంధ్రప్రదేశ్ విభజనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ కూడా ప్రధాన కారణం అనే విషయాన్ని ఇటు కాంగ్రెస్, అటు వైసిపి జనాల్లోకి బాగానే తీసుకెళ్లాయి. తద్వారా విభజనకు కారణమైన ప్రధాన ముద్దాయిల్లో టిడిపి కూడా నిలబడాల్సి వచ్చింది. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత తొందరపడ్డ చంద్రబాబు రాజధాని నిర్మాణం, ఖర్చు , పద్దులు అంటూ చిన్నపాటి చిట్టా ప్రకటించి నాలుక్కర్చుకున్నారు. సీమాంధ్ర ఉద్యమం తీవ్రత తెలుసుకుని ఢిల్లీ సాక్షిగా దీక్ష చేసినా ఫలితం ఇసుమంతైనా కనిపించలేదు. విభజన చివరి దశలో ఉండగా.. దేశపర్యటన చేసినప్పటికీ ఒరిగింది శూన్యమే. అంతేకాకుండా.. విభజన నిర్ణయం తీసుకున్న దగ్గర్నుంచి, పూర్తయ్యే దాకా.. 'ఇరు ప్రాంతాలకు సమన్యాయం' అనే మాట తప్ప, 'రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి' అనే డిమాండ్ మాత్రం ఒక్కసారి కూడా అన్నపాపాన పోలేదు. మరోవైపు సీమాంధ్రలో జగన్ ప్రభావం ఎలాగూ ఉండనే ఉంది. పైపెచ్చు.. తొలుత సమన్యాయం అన్న వైసిపి, ఆ తర్వాత పూర్తిగా సమైక్యాంధ్ర స్టాండ్ ను ప్రదర్శించి మార్కులు కొట్టే ప్రయత్నం చేసింది. ఇక కాంగ్రెస్ తన మార్కు రాజకీయాన్ని అంతో ఇంతో తప్పక ప్రదర్శిస్తుంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు టిడిపిని సీమాంధ్ర ప్రజలు ఎలా గెలిపిస్తారు..? తమకు విజయం ఎలా దక్కుతుంది..?? అని తమ్ముళ్లు మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణలో ఉదయించేదెలా..?    ఇక తెలంగాణ విషయానికి వస్తే పరిస్థితి మరింత దిగజారినట్లే ఉంది. మంత్రి పదవి దక్కనందుకు బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్.. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబునే ప్రధానంగా టార్గెట్ చేశారు. తెలంగాణకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అంటూ బాగానే ప్రచారం సాగించారు. బాబు తెలంగాణ వ్యతిరేకి అనే ప్రచారం జనాల్లోకి కూడా తీవ్రంగానే వెళ్తోందన్న విషయాన్ని గమనించిన టిడిపి అధినేత.. తప్పని పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలం అంటూ కేంద్రానికి లేఖ ఇచ్చారు. అయినప్పటికీ దానికి తగిన ఫలితం రాలేదనే చెప్పాలి. కారణం.. మళ్లీ చంద్రబాబు తీసుకున్న స్టాండే! ఇక్కడ కూడా సమన్యాయం పాట పాడడంతో.. ప్రత్యర్థులు మళ్లీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ రావడం బాబుకు ఇష్టం లేదు అంటూ ప్రచార పర్వం కొనసాగించారు. విభజన చివరి దశలో బాబు చేసిన దేశ పర్యటన తెలంగాణను అడ్డుకోవడానికే అన్నట్టు ఇక్కడి ప్రత్యర్థులు చిత్రించారు. మొదటి నుంచి చివరి వరకు సమన్యాయం గానం ఆలపించిన బాబు.. సమన్యాయం అంటే ఏంటో చెప్పకుండానే విభజన పూర్తయ్యింది.    ఈ విధంగా.. రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకోవాలనే ధోరణితో బాబు తీసుకున్న అస్పష్టమైన నిర్ణయం ఇరువైపులా పార్టీని ఇబ్బందుల్లో పడేసిందే తప్ప, మేలు చేయలేదనేది విశ్లేషకుల మాట. మరి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ టిడిపి విజయం సాధిస్తుందన్న అధినేత మాటలను అర్థం చేసుకుని, జీర్ణించుకునేందుకు తమ్ముళ్లు కాస్త ఇబ్బంది పడ్డట్టే అనిపించిందని పేర్కొంటున్నారు.