Thursday 24 April 2014

కటకటాల కేవీపీ..?

KVP Ramachandra
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 'ఆత్మ' బంధువు కేవీపీ అరెస్టుకు అమెరికాలో రంగం సిద్ధమైనట్లు సమాచారం. కేవీపీ అరెస్ట్ విషయమై అమెరికా, భారత్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పీటీఐ వార్తా కథనం ప్రచురించింది. మనీలాండరింగ్ , టైటానియం కుంభకోణంలో కేవీపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఏమిటీ టైటానియం..?
 
టైటానియం అనేది ఒక లోహం.. ఇనుప గనుల్లోంచి ఇనుము తీసినట్లు.. సముద్ర తీర ప్రాంతం నుండి టైటానియం అనే లోహాన్ని తీస్తారు. దీనిని విమానాలు, జలాంతర్గాములు, క్షిపణుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాదు.. కృత్రిమ అవయవాలు, మొబైల్ ఫోన్లు, క్రీడా వస్తువులు, ఆభరణాల తయారీలోనూ టైటానియం ఎక్కువగా ఉపయోగిస్తారు.
రూ.111 కోట్ల ముడుపులు..
అమెరికా 'టైటానియం'ను వ్యూహాత్మక లోహంగా పరిగణించి దీన్ని స్టోర్ చేసుకోవడం ప్రారంభించింది. దీంతో ఈ లోహం విలువ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో.. మన రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల నుండి టైటానియం వెలికితీసేందుకు.. వాటిని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 ఏప్రిల్ 18న 'బెత్లీ' అనే సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా విదేశీ కంపెనీల నుండి మన రాష్ట్ర 'పెద్దల' కు రూ.111 కోట్ల ముడుపులు అందాయని... డిఎఫ్ (దిమిత్రి ఫిర్టాష్) గ్రూపు అనుబంధ సంస్థలు ఈ ముడుపులు వీరికి అందజేశాయని.. ఎఫ్ బిఐ తేల్చింది.
ప్రధాన నిందితులు ఆరుగురు...
 
ఈ ముడుపుల భాగోతంలో ప్రధానంగా ఆరుగురు నిందితుల పేర్లను ఎఫ్ బి ఐ బయటపెట్టింది. ఇందులో.. మన రాష్ట్రానికి చెందిన, వైఎస్ ఆత్మ బంధువైన కేవీపీ ఉన్నారు. ఈయనతో పాటు డిఎఫ్ గ్రూపు కంపెనీల అధినేత దిమిత్రి ఫిర్టాష్, హంగేరీకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రాస్ నోప్, అమెరికాలో స్థిరపడిన భారతీయుడు గజేంద్రలాల్, శ్రీలంకకు చెందిన పెరియస్వామి, ముడుపుల సమన్వయ కర్తగా వ్యవహరించిన సురెన్ జెవోర్జియాన్ పేర్లను ప్రధానంగా పేర్కొంది. వీరితో పాటు.. ఎపిఎండిసి ఎండి రాజగోపాల్ , మిస్టర్ 'సి' ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈ మిస్టర్ 'సి' ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు.
కేవీపీ విషయంలో స్పందించని ప్రభుత్వం..
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉక్రెయిన్ వ్యాపారవేత్తను ఆ దేశ ప్రభుత్వం మార్చి 12, 2014న అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన రూ.1000 కోట్ల పూచీకత్తుపై విడుదల కావాల్సి వచ్చింది. కానీ మనదేశ ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో సరిగ్గా స్పందించలేదు. టైటానియం కుంభకోణానికి సంబంధించిన నిందితులలో రాజ్యసభ ఎంపి కేవీపీ ఉన్నప్పటికీ ఈ ఘటనపై విచారణ జరిపే ప్రయత్నం కూడా చేయలే
దు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం విచారణ పూర్తిచేసి.. కేవీపీ అరెస్టుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

జేపీ మావాడే : మోడీ.. నా మద్దతు మోడీకే : జేపీ

Jayaprakash Narayan and Modi 
సరిగ్గా పదిరోజుల క్రితం లోక్ సత్తా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ వీడియో ఒకటి మీడియాలో హల్ చల్ చేసింది. కొందరు కార్పొరేట్ ప్రతినిధులతో 35 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుతున్న కేజ్రీవాల్.. ఓ జాతీయ ఛానెల్ చేసిన 'స్టింగ్ ఆపరేషన్' లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తప్పనిసరి పరిస్థితుల్లో.. కేజ్రీవాల్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే.. తమ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టిన మీడియాపై జేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనురాగ్ కేజ్రీవాల్ వ్యాఖ్యలను కొన్ని ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మీడియాలోని ఒక వర్గం తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు.
జేపీ తనమనిషన్న మోడీ.. మోడీకే మద్దతన్న జేపీ..
 
సీన్ కట్ చేస్తే.. స్టింగ్ ఆపరేషన్ లో అనురాగ్ కేజ్రీవాల్ మాట్లాడిన ప్రతి మాటా నిజమేనని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు మోడీ, జేపీ తాజా వ్యాఖ్యలే నిదర్శనంగా చూపుతున్నారు. 'మీరు నా మనిషి. మీ అవసరం దేశానికి చాలా ఉంది. దేశంలో సంస్కరణలను అమలు చేయాలంటే మీలాంటి వారు లోక్ సభలో ఉండాలి'. అని.. లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను ఉద్దేశించి.. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మరోవైపు జేపీ కూడా.. మోడీకే తన పూర్తి మద్దతు అని, భావి ప్రధాని మోడీనే అని చెబుతున్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపే సత్తా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని పొగిడేశారు.
అంటే.. అనురాగ్ మాటలన్నీ వాస్తవమేనా..?
 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే అందులో జేపీ మంత్రి పదవి దక్కించుకోవడం ఖాయమని, ఆయన శాఖలో మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతామని, దానికోసం ప్రస్తుతం ఎన్నికల ఖర్చు కింద రూ.35 కోట్లు ఇవ్వాలని కార్పొరేట్ ప్రతినిధులతో డీల్ సందర్భంగా అనురాగ్ కేజ్రీవాల్ మాట్లాడిన ప్రతిమాటా నిజమేననే ఊహాగానాలకు ప్రస్తుత పరిస్థితులు బలం చేకూరుస్తున్నాయి. జేపీ, మోడీ ఒకరినొకరు పొగుడుకోవడం ఇందులో భాగమేనని పలువురు పేర్కొంటున్నారు.
ఇంతకీ.. సంస్కరణలు ఎవరికోసం..?
 
నరేంద్ర మోడీ మాటల్లో దేశంలో విస్తృతమైన సంస్కరణలు రావాలని.. వాటిని అమలు చేయాలంటే జేపీ లాంటి వారు లోక్ సభలో ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇంతకీ ఈ సంస్కరణలు ఎవరి కోసం..? ప్రజల, ప్రభుత్వ ఆస్తులు దోచుకుని వేల కోట్ల రూపాయల లాభాలు వెనకేసుకునే కార్పొరేట్ల కోసమా..?? లేక సాధారణ ప్రజానీకం కోసమా..!? దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక సంస్కరణల కారణంగా ధనవంతులు రోజురోజుకూ ఆస్తులు కూటగట్టుకుంటుంటే.. పేదలు మరింత పేదలుగా దిగజారిపోతున్నారు. ఇప్పుడు జేపీ లోక్ సభలో పాగావేసి ఇవే సంస్కరణలను మరింత పటిష్టంగా అమలు చేయాలని మోడీ కోరుతున్నారు. దీనికి జేపీ కూడా తన అంగీకారం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో.. జయప్రకాష్ నారాయణ చెప్పే నీతి వాక్యాలన్నీ ప్రజలను, యువతను బుట్టలో వేసుకోవడానికే తప్ప, ఆయన మాటల్లో నిజాయితీ లేదనేది స్పష్టమవుతోందని చెబుతున్నారు.