Friday 2 May 2014

సీమాంధ్ర కాంగ్రెస్ లో సోనియా సభ టెన్షన్..


హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ కు గుంటూరు గుబులు పట్టుకుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొనే సభనెలా విజయవంతం చేయాలా? అని అక్కడి నేతలు టెన్షన్ పడుతున్నారు. విభజనకు మూల కారణం సోనియాయే అని సీమాంధ్ర ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్న నేపధ్యంలో గుంటూరు సభ నేతలకు తలనొప్పినే తెచ్చిపెడుతోంది. ఒకానొక దశలో సీమాంధ్రలో సోనియా ప్రచారం చేయాల్సిన అవసరమే లేదని నేతలు భావించారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ సోనియాగాంధీ సభను గుంటూరులో ఏర్పాటు చేశారు. కానీ ఆమెని ప్రజలెలా ఆదరిస్తారో అనే ఆందోళనే ఇప్పుడు కాంగ్రెస్ నేతల్ని వేధిస్తోంది.
ప్రచారంలో స్పందన నామమాత్రం..
  
ఇప్పటిదాకా సీమాంధ్రలో ఎన్నికల ప్రచారాన్ని రఘువీరా, చిరంజీవి నిర్వహిస్తున్నారు. వారి ప్రచారానికి ప్రజలనుంచి వస్తున్న స్పందన నామమాత్రంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలపట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోలేక చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో ప్రచారం చేసినట్లే సీమాంధ్ర లో సోనియా ప్రచారం చేస్తే బాగుంటుందనుకున్నారు. అయినా, వ్యతిరేక ఫలితాలొస్తాయేమోననే ఆందోళన కూడా నేతల్ని వెంటాడుతోంది.
కార్యకర్తలపై జనసమీకరణ బాధ్యత..
   
సోనియా గాంధీ సభ షెడ్యూల్ ప్రకటించి నేతలు చేతులు దులుపుకోవడంతో జనసమీకరణ బాధ్యత కిందిస్థాయి కార్యకర్తలపై పడింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. విభజనకు సోనియా కారణం అని భావిస్తున్న ప్రజల్ని సభదాకా ఎలా తీసుకురావాలో తెలీక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు సభ జరుగుతున్నప్పుడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ముందు సోనియా సభను విశాఖపట్నంలో జరపాలని నిర్ణయించినా అక్కడి నేతలు చేతులెత్తేయడంతో వేదిక గుంటూరుకు మారింది.

No comments:

Post a Comment