Thursday 13 February 2014

ఈరోజు.. పార్లమెంటులోకి కత్తులు.. పెప్పర్ స్ర్పే.. మరి రేపు..?

http://www.10tv.in/news/national/Knives-and-Pepper-Spray-in-Parliament-today-Tomorrow-30899
  భారత పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు..! నిండు సభలో ప్రజాప్రతినిధులు తమను తాము మరచిపోయి.. కత్తులు, హానికర వాయువులతో హల్ చల్ చేశారు..!! స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సభా మర్యాదను ఖూనీ చేశారు..!!! ఇది దేనికి సంతకేతం..? ఈ రోజు కత్తి, పెప్పర్ స్ర్పే ప్రత్యక్షమైన సభలో రేపు ఏం
కనిపించబోతున్నాయి..?? అంతిమంగా.. సభ్యుల ప్రవర్తన భావి తరాలకు ఏం నేర్పిస్తోంది..???
పెప్పర్ స్ర్పే చేసిన లగడపాటి... 
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెడుతున్న సందర్భంలో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఒక అడుగు ముందుకేసి స్పీకర్ పై పెప్పర్ స్ప్రే చేశారు. దీనితో సభలో ఘాటైన వాసన రావడంతో పలువురు ఎంపీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సభలోకి కత్తితో వచ్చారని పలువురు వ్యాఖ్యానించారు. దీనిపై మోదుగుల స్పందిస్తూ తాను కత్తితో రాలేదని, స్పీకర్ మైకు విరిచానని, అది కత్తిలా కనిపించిందని చెప్పారు.
బాహా బాహీకి దిగిన ఎంపీలు...  
  విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ మూజువాణి పద్ధతిలో అనుమతి తీసుకున్నారు. దీంతో వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు ఆందోళనకు దిగారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనల మధ్యే హోం మంత్రి షిండే బిల్లును చదివే తతంగం ముగించారు. ఈ క్రమంలోనే సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. లోక్సభ సెక్రటరీ బల్లపై ఉన్న ఫైళ్లను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చిందరవందరగా పడేశారు. స్పీకర్‌ వద్ద మైకులను తొలగించేందుకు ప్రయత్నించగా, తెలంగాణ ఎంపీలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు ప్రాంత ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే.. లగడపాటి పెప్పర్ స్ర్పే చేశారు. దీంతో.. రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై తెలంగాణ ఎంపీలు పిడిగుద్దులు కురిపించారు. భవిష్యత్ లో ఏం జరగబోతోంది..?    ఏ ప్రాంతం వారైనా కావచ్చు.. సమస్య ఏదైనా కావచ్చు.. తమకు అభ్యంతరం ఉన్న అంశాలపై సభలో చర్చించాల్సిన ఎంపీలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే.. ఉపయోగం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ స్థాయిని మరచి పోయి అప్రజాస్వామిక రీతిలో వ్యవహరించిన వారు.. భవిష్యత్ భారత పౌరులకు ఏం నేర్పుతున్నారని నిలదీస్తున్నారు. ఈ రోజు నిండు సభలోకి నిషేధమైన వస్తువులతో వచ్చిన వారు.. రేపు ఎలాంటి వాటిని తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. సభా మర్యాదలు పాటించడంలో కనీస ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్న వీరు ప్రజాప్రతినిధులుగా ఉండజాలరని పేర్కొంటున్నారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.

see more at:
http://www.10tv.in/news/national/Knives-and-Pepper-Spray-in-Parliament-today-Tomorrow-30899
 

for more news brows :
 - www.10tv.in


- Media10 team