Friday 14 March 2014

పవన్ పంచ్ డైలాగ్స్..


pawan kalyan
హైదరాబాద్: జనసేన పార్టీ ఆవిర్భావ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ పేల్చిన పంచ్ డైలాగ్స్ ఇలా..
సామాన్యుల సేన.. జనసేన..
కాంగ్రెస్ పార్టీ గంగానదా..
జైరాం రమేష్ మరో మౌంట్ బాటన్..
నేను ఆంధ్రోన్ని కాదు..భారతీయున్ని..
భగత్ సింగ్ జీవితం స్పూర్తి దాయకం..
కవితమ్మా.. తెలంగాణ జాగృతి విరాళాల లెక్కలు చెప్పమ్మా..
చట్టం ఏ ఒక్కరికీ చుట్టం కారాదు..
రాహుల్ బ్రహ్మచారే కానీ..
తెలంగాణలో జగ్గారెడ్డే అసలైన నాయకుడు..
కేసీఆర్ ను తప్పుపట్టడం సరికాదు..
నాకు సిఎం పదవి తుఛ్చమైనది..
స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తాటతీస్తా...
పాల్కుర్కి గొప్పా.. నన్నయ్య గొప్పా అంటే ఏం చెబుతాం..
ప్రాంతాలుగా విడిపోయాం.. సోదర భావంతో మెలుగుదాం..
విభజన విషయంలో.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా..
వ్యక్తిగత విమర్శలుకు దిగితే.. మీ భాగోతాలు బయటపెడుతా..
అప్పటి సిపిఎఫ్ ఇప్పటి జనసేన పార్టీ..
మీరు నన్ను తిట్టే కన్నా.. ఢిల్లీ వాళ్లని తిట్టండి..
నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు..
అలాగే సీమాంధ్ర ఆత్మగౌరవం దెబ్బతింటే చూస్తూ ఊరుకోను..
ప్రజాధనం లూఠీ చేస్తే .. తాట తీస్తా..
పేపర్, ఛానల్ కోసం పార్టీ ఏర్పాటు చేయలేదు..
అల్లుడు, అబ్బాయ్ ల భాగోతం యూట్యూబ్ లో విడుదల చేస్తా..
నాది బాంచన్ నీ కాల్మొక్తా అనే మనస్తత్వం కాదు..
అన్నయ్యను ఎదురు నిలబడేందుకు కారణం కాంగ్రెస్సే..
కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో..

కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో : పవన్

pawan kalyan at party announcement.

భారతదేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తూ... దేశాన్నే సర్వ నాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, తద్వారా దేశాన్ని రక్షించుకోవాలని సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతను నాశనం చేస్తున్నాయని విమర్శించారు...
రాష్ట్ర విభజనకు పాలకులే కారణం...
 
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడానికి దశాబ్దాల తరబడి పాలించిన పాలకులే కారణమని పవన్ కళ్యాణ్వి మర్శించారు. సమస్య ను మొగ్గలోనే తుంచకుండా తమ అవసరాలకోసం వాడుకున్నారని అన్నారు. ఫలితంగానే అది ముదిరి నేడు రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి కారణమైందని చెప్పారు. దీనికి పూర్తిగా రాష్ట్రాన్ని పాలించిన వారే బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
విభజనతో దేశ సమగ్రతకు భంగం...
 
ప్రాంతాల వారీగా జరిగే విభజనలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసమే ఆంధ్రప్రదేశ్ ను విభజించిందని అన్నారు. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనే అయితే.. 2009లోనే ఎందుకు రాష్ట్రాన్ని విభజించలేదని ప్రశ్నించారు. ఐదేళ్లపాటు కాలయాపన చేసి, పార్లమెంట్ చివరి సెషన్ లో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో ఎందుకు విభజించాల్సి వచ్చిందని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
నేను భారతీయున్ని...
 
తాను భారతీయున్నని, తనకు కులం, మతం, ప్రాంతం లేవని పవన్ చెప్పారు. తనను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తినని అంటే బాధగా ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విడదీసినప్పటికీ.. ప్రజల్ని మాత్రం విడదీయొద్దని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర ప్రాంతంపై విద్వేషాలు పెంచడం సరికాదని, తెలంగాణ అభివృద్ధి కోసం విధానాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రం విడిపోతే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన వారు.. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారో.. తెలంగాణలోని రైతులందరికీ చెప్పాలని, అప్పుడు అందరూ అభివృద్ధి చెందుతారని పరోక్షంగా కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రజల మధ్య ద్వేషం పెంచే ప్రయత్నం...
 
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం జరుగుతోందని పవన్ అన్నారు. ఇందుకోసం కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ పద్ధతిని విరమించుకోవాలని హెచ్చరించారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య సుహృద్భావం పెంచేందుకు జనసేన పాటుపడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి.. ప్రజలుగా కలిసుండాలని, రెండు రాష్ట్రాలూ అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ దిశగా జనసేన కృషి చేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ వల్లే అన్నయ్యకు ఎదురుగా...
 
అన్నయ్య చిరంజీవికి తాను ఎదురుగా నిలబడడం లేదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలోనే.. తప్పక ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అన్నయ్య అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు.
మూడోపెళ్లి నా వ్యక్తిగతం..
 
తన మూడో పెళ్లి గురించి పవన్ మాట్లాడుతూ... ...see more..

అన్యాయాన్ని ప్రశ్నించేందుకే- పవన్

pawan kayan 
హైదరాబాద్: ఎంతో అంతర్మధనం చేసిన తరువాతే తాను జనసేనను స్ధాపించాలని నిర్ణయించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రెండు దశాబ్ధాల వేదన తరువాత తాను ప్రజలకు, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయని అన్నారు. ఈ నిర్ణయానికి కట్టుబడి అన్నీ కోల్పోవడానికి తాను సిద్ధపడ్డానని చెప్పారు.   

సామాజిక సృహ అప్పటినుంచే- పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్: తాను 7 వ తరగతి చదువుతున్నపుడు చూసిన ఘటన వల్లే తనలో సామాజిక స్పృ హ పెరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. సామాన్యుడు ఏవిధంగా బాధపడుతాడో తనకు ఆరోజే తెలిసిందని చెప్పారు. లోకంలోని మనుషులంతా మనసులో ఒక మాట నోటి నుంచి ఒక మాట మాట్లాడుతారని అన్నారు. సమాజంలో సామాన్యులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జీవితంలో ప్రతీ చోట తనకు సమస్యలే కనిపించేవని అన్నారు. తనలో మెదిలిన ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు విప్లవ సాహిత్యం, తెలంగాణ సాయుధపోరాటం గురించి చదివానని చెప్పారు. తనలో తిరుగుబాటు తత్వం ఎప్పటికీ పోదని అన్నారు. సమాజంపై కోపంతో మార్షల్ ఆర్ట్స్ , యోగ నేర్చుకున్నానని అప్పటికీ తన మదిలో మెదిలిన ప్రశ్నలకు సమాధానం లభించేది కాదని, నిరాశ, నిశ్పృహతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించానని చెప్పారు. తన జీవితంలో ప్రవేశించిన అమ్మాయిలు తన మనసు మార్చారని అన్నారు.సమాజం పట్ల, దేశం పట్ల పోరాటం చేయాలని తాను వేసుకున్న ప్రశ్నే తనను ప్రజల ముందు నిలబెట్టిందని అన్నారు.

దేశ సమగ్రత కోసం ప్రాణాలు సైతం అర్పిస్తా- పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్: దేశ సమగ్రతను కాపడేందుకు తాను ప్రాణాలను అర్పించేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజం కోసం ప్రశ్నించేందుకు తాను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని చెప్పారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారి తాట తీస్తానని హెచ్చరించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు బలిపీఠమెక్కే మొదటి వ్యకి తానే అవుతానని చెప్పారు.

కాంగ్రెస్ తో తప్ప.. పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్: జనసేన పార్టీ కాంగ్రెస్ తో తప్ప ఏపార్టీతోనైనా కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. టిడిపి తోనూ కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలలో పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలలో సుస్ధిరతను సాధించేందుకు జనసేన కృషిచేస్తుందని చెప్పారు.

'ఎన్నికల' కోసమే 'విభజన' - పవన్




హైదరాబాద్ : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఢిల్లీ పెద్దలు.. ఇప్పుడు విభజన నిర్ణయం తీసుకున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలంగాణ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే.. 2009లోనే ఇచ్చిఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. అలా చేసిఉంటే.. 1000 మంది యువకులు ఆత్మహత్య చేసుకునే వారు కాదని తెలిపారు. సోనియా, రాహుల్ పద్దతి ప్రకారం ఇరు ప్రాంతాల వారితో మాట్లాడి ఉండాల్సిందన్నారు. విభజన విషయంలో అధిష్టానం స్వార్థ పూరితంగా వ్యవహరించిందని, కేవలం 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేసిందని చెప్పారు. తెలుగు వారికి ఢిల్లీ నేతలు ఎప్పుడూ విలువ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాల పరిరక్షణకే జనసేన పుట్టింది - పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్ : చట్టాలు అందరికీ సమానంగా అమలయ్యేలా చూసేందుకే జనసేన పార్టీ పుట్టిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. నైతిక విలువలు కాపాడే యువనాయకుల కోసం వెతుకున్నానని, జనసేన పార్టీ సిద్ధాంతాలు కాపాడే ప్రతి ఒక్కరినీ ఈ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించడానికి.. పత్రికలు, టీవీలు స్థాపించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకు అంతకంటే రాలేదన్నారు. అన్ని సౌకర్యాలూ ఒక్కరే పొందాలని అనుకున్నప్పుడే దేశంలో జాతి వైరుధ్యాలు, వైషమ్యాలు వస్తాయని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తాం కానీ.. అదెప్పుడు అనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. ప్రస్తుతం తమ పార్టీ నిర్మాణ దశలో ఉందన్నారు. 

'ఆంధ్రోడు' అంటే బాధగా ఉంది - పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్ : తనను 'ఆంధ్రోడు' అంటే చాలా బాధగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేదని.. తాను భారతీయుడినని పేర్కొన్నారు. అలాగే తనకు కులం, మతం అనే తేడా కూడా లేదని స్పష్టం చేశారు. భాష కన్నా భావం ముఖ్యమని.. గురజాడ, శ్రీశ్రీ ల్లో ఎవరు గొప్ప అనే పరిస్థితి రాకూడదని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విడదీసినా.. ప్రజల్ని విడదీస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. కెసిఆర్ మాటలు ఫ్యూడల్ దురహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన కెసిఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణలోని రైతులందరికీ అదే విధానాన్ని నేర్పాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి కోసం విధానాలు రూపొందించాలన్నారు

కవితా.. ముందు మీ లెక్కలు చెప్పండి - పవన్

Pawan Kalyan
హైదరాబాద్ : తనను విమర్శించే ముందు.. తెలంగాణ జాగృతికి వచ్చిన విరాళాల లెక్కలు ప్రజలకు చెప్పాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కెసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తనకు కవిత చెల్లెలు లాంటిదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలనే విషయానికి, కెసిఆర్ కుటుంబానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.  

విభజన పాపం నేతలదే - పవన్

pawan kalyan 10tv

హైదరాబాద్ : రాష్ట్రాన్ని పాలించిన నేతలంతా విభజనకు బాధ్యత వహించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు రాష్ట్ర విభజన పాపం నేతలందరిదనీ ఆయన పేర్కొన్నారు. నేతలకు.. డబ్బులు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ దేశంపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం జరిగి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజకీయ నాయకుల పాపం వల్లే ఇరు ప్రాంతాల సామాన్యులు కొట్టుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితికి కారణమైన నేతలంతా బయట మాత్రం కలిసి మెలిసే తిరుగుతున్నారని పేర్కొన్నారు.   

నేను భగత్ సింగ్ వారసుడిని - పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్ :  తాను భగత్ సింగ్ వారసుడినని, ఆయన స్ఫూర్తితో అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించేందుకు పోరాటం చేస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేందుకు తన ప్రాణాలు కూడా లెక్కచేయని ఆనాటి విప్లవ వీరుడు భగత్ సింగ్ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. 20 ఏళ్ల వయసులో భగత్ సింగ్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.    

బానిసను కాను - పవన్

Pawan Kalyan
హైదరాబాద్ : తనది బానిస మనస్థత్వం కాదని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నోవాటెల్ హోటెల్ లో జనసేన పార్టీని ప్రకటించే సమయంలో ఆయన మాట్లాడుతూ... బాంచన్ దొర అని కాళ్లు పట్టుకునే అలవాటు తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో కూర్చున్న వారి కాల్లు మొక్కడం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.   

విభజన తీరు నచ్చలేదు : పవన్ కళ్యాణ్

pawan kalyan 10tv
హైదరాబాద్ : రాష్ర్ట విభజన తీరు తనకు నచ్చలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ర్ట విభజన విషయంలో బిజెపి నేత వెంకయ్య నాయుడు సీమాంధ్ర ప్రజల కోసం చేసిన ప్రయత్నం తనకు నచ్చిందన్నారు. అందుకే వెంకయ్యనాయుడు అంటే తనకు చాలా ఇష్టమని ప్రసంశించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని అడుగుతుంటే కేంద్ర మంత్రి జయరాం రమేశ్ కొసరి కొసరి కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల్లోని నాయకులతో తనకు వ్యక్తిగతంగా పరిచయాలున్నాయని అయితే... వారంటే తనకు ఎలాంటి అయిష్టం లేదని తెలిపారు. వారి సిద్ధాంతాలు వేరు, తన సిద్ధాంతాలు వేరని వివరించారు. వారి సిద్ధాంతాలతో తాను ఏకీభవించలేనన్నారు. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తెలిపారు. 

వ్యక్తిగత' విమర్శలు వద్దు - పవన్

Pawan Kalyan
Pawan kalyan www.10tv.in
హైదరాబాద్ : '' రాజకీయ నాయకులు నాపై విమర్శలు చేస్తే నేను భయపడను. పిరికితనం అంటే నాకు చిరాకు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ వెన్నుచూపను'' అని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చెప్పారు. తాను రాజకీయ పార్టీ పెడుతున్నానంటే అనేక మంది రకరకాల విమర్శలు చేశారని తెలిపారు. పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో కలపాలని దిగ్విజయ్ కోరినట్లు చెప్పారు. అలా కలిపేందుకు కాంగ్రెస్ ఏమైనా గంగానదా..? అని ప్రశ్నించారు. తాను పార్టీ పెడుతున్నట్లు ఇటీవల వార్తలొస్తుంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గంగిరెద్దుల మాదిరిగా కొత్త దుకాణం పెడుతున్నారని చేసిన కామెంట్ కు పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.   

నాటి సీపీఎఫ్.. నేటి జనసేన – పవన్

pawan kalyan 10tv
హైదరాబాద్ : సీపీఎఫ్(కామన్ మేన్ ప్రొటక్షన్ ఫోర్స్) ఆగలేదని.. నాటి సీపీఎఫ్ నేటి జనసేన గా మారిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నోవాటెల్ లో ఆయన మాట్లాడుతూ.. '' నీకు దేశం ముఖ్యమా..? ప్రాణం ముఖ్యమా..? అంటే దేశమే ముఖ్యం అంటాను'' అని చెప్పారు. తనకు శత్రువులెవరూ లేరని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం తన మిత్రులకు ఇష్టం లేదని.. వారితో గొడవ పెట్టుకుని వచ్చేశానని తెలిపారు.

నా పార్టీ పేరు 'జనసేన' : పవన్ కళ్యాణ్

Pawan Kalyan
Pawan kalyan www.10tv.in
హైదరాబాద్ : తన పార్టీకి 'జనసేన' అని పేరు పెట్టినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు వేలాది మంది అభిమానుల మధ్య, నోవాటెల్ లో ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. తనకు పదవుల మీద ఆసక్తి లేదని.. మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులపై కోరిక లేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన పరిస్థితిని చూస్తే విసుగొచ్చిందని.. నేతల మీద అసహ్యం వేసిందని అందుకే ఒక నిర్ధిష్టమైన ఆలోచనా విధానం తోటి, సుదీర్ఘమైన లక్ష్యంతోటి ముందుకు వచ్చానని చెప్పారు.

కాంగ్రెస్ వల్లే అన్నయ్యకు ఎదురు నిలిచా - పవన్

Pawan Kalyan
Pawan kalyan www.10tv.in
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే ప్రస్తుతం అన్నయ్యకు ఎదురు నిలిచానని, అన్నయ్యపై వ్యక్తిగతంగా తనకెలాంటి కోపం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. శుక్రవారం నాడు నోవాటెల్ లో జనసేన పార్టీని ప్రకటించిన ఆయన మాట్లాడుతూ.. ఇదంతా 'హై కమాండ్' తప్పే నని పేర్కొన్నారు. అన్యాయాలకు అక్రమాలకు ఎదురు నిలబడాలనే ఆలోచన తనకు లేదని.. కానీ, ఆ పరిస్థితిని ఢిల్లీలోని పెద్దలు కల్పించారని పేర్కొన్నారు. సినిమాలు చేసుకుంటూ ప్రజలకు ఆనందం కల్పించాలనుకునే తనను ఇలా రాజకీయాల్లోకి వచ్చేలా చేశారని తెలిపారు.

నోవాటెల్ కు చేరుకున్న పవన్...

Pawan Kalyan
pawan kalayan www.10tv.in


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్ కు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మరోవైపు ఆయన అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న సభలో పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ‘జన సేన’ విధి విధానాలను స్వయంగా ప్రకటించనున్న విషయం తెలిసిందే.........