Friday 28 February 2014

విభజన అంశంలో ఎత్తులు..! పై ఎత్తులు..!! (చిత్తైంది ఎవరు..?)


మహాభారత యుద్ధంలో శత్రువును ఓడించేందుకు శకుని అమలు చేసిన మాయోపాయాలు అన్నీ ఇన్నీ కావు.. అలాంటి వాడిని పార్లమెంటు సాక్షిగా మైమరిపించారు అభినవ శకునిలు..! రాష్ట్ర విభజన విషయంలో ఆయా పార్టీలు అమలు చేస్తున్న వ్యూహాలకు ప్రత్యర్థులు ప్రతి వ్యూహాలు రచిస్తూ ఔరా అనిపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన ఫలంలో మెజారిటీ వాటా దక్కించుకునేందుకు ఎవరికి వారు చేయని ప్రయత్నం లేదు..! అనుసరించని వ్యూహం లేదు..!! అమలు చేయని ప్రణాళిక లేదు..!!! అయితే.. ఈ పో(ఆ)రాటంలో ఎవరు సక్సెస్ అయ్యారు..? ఎవరు ఫెయిల్యూర్ ను చవి చూశారు..??

సీనియార్టీ చూపించిన కాంగ్రెస్...
దేశాన్ని ఏలేందుకు దశాబ్దాల తరబడి అలవాటు పడ్డ కాంగ్రెస్.. విభజన ఎపిసోడ్ నూ అధికార పీఠాన్ని అందుకునే రాచబాటగా మలుచుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల ద్వారా యువరాజుకు పట్టాభిషేకం జరిపించాలంటే ఆంధ్రప్రదేశ్ విభజన అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్.. ఆ పనికి ఏనాడో సిద్ధపడింది. తెలుగు డైలీ సీరియల్ ను మించిన రీతిలో ఏళ్లతరబడి సాగదీసి, ట్విస్టులు కలగలిపి పార్లమెంటు వరకూ విభజనను తీసుకొచ్చింది. లోక్ సభలో విభజన బిల్లుకు తీవ్ర స్థాయిలో అడ్డంకులు ఎదురు కావడంతో తన సీనియార్టీకి మరింత పదును పెట్టింది. సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పెద్దలు ఒక్కసారిగా అలర్టై, ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశారు. ఇందులో భాగంగా.. ఎప్పటి నుంచో తెలంగాణకు అనుకూలమంటున్న బిజెపి మద్దతు ఇస్తేనే.. టి.బిల్లు పాస్ అవుతుందని, లేకుంటే అంతే సంగతులు అంటూ.. భారతీయ జనతా పార్టీయే రాష్ట్రాన్ని విడగొట్టాల్సి ఉందని జనాల్లోకి సంకేతాలు పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సమయం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశాన్ని క్రెడిట్ గా మార్చేసి దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం ముమ్మరం చేసింది. దీనికోసం.. తమ నుంచి అధికారం లాగేసుకోవాలని ఎదురు చూస్తున్న బిజెపితో ఏకంగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ విందు సమావేశాలు ఏర్పాటు చేశారు. బిజెపి సూచిస్తున్న డిమాండ్లలో కొన్నింటికి ఓకే అనేశారు. ఇక లోక్ సభలో బిల్లుపై చర్చ సాగుతున్న తరుణంలో సీమాంధ్ర ఎంపీలను ఉసిగొల్పడం ద్వారా కాంగ్రెస్ ఎంపీలకు వ్యక్తిగత ఇమేజ్ వచ్చే ఏర్పాటు చేసింది. ఈ వ్యూహంలో భాగమే లగడపాటి పెప్పర్ స్ప్రే. అక్కడ ముగిసిన తర్వాత రాజ్య సభలో కేవీపీ ద్వారా విగ్రహం రూపంలో సమైక్య వాదాన్ని వినిపించే ప్రయత్నం చేసింది. ఈ విధంగా మొత్తం విభజన ఎపిసోడ్ ను తన చుట్టూ తిప్పుకోవాలని చేసిన ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన విజయం సాధించింది.

''ఒక్క దెబ్బ .. రెండు పిట్టలు'' ఇదే బిజెపి వ్యూహం...
''చిన్న రాష్ట్రాలు-బలమైన కేంద్రం'' అనే ఎజెండాతో ముందుకు సాగుతున్న బిజెపికి ఆంధ్రప్రదేశ్ విభజన అంశం.. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్లైంది. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే వ్యూహాన్ని అమలు చేసింది. ఏపీ విభజన ద్వారా దేశాన్ని ముక్కలు చేయాలనే అంశం నెరవేరుతుండడంతోపాటు, దక్షిణ భారత దేశంలోనే కొరకరాని కొయ్యగా మారిన ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా తెలంగాణలో బలపడే ఛాన్స్ వచ్చిందని బిజెపి సంతోషం వ్యక్తం చేసింది. దీంతో తాను సైతం విభజన రాగం ఆలపించడం మొదలు పెట్టింది. విభజన బిల్లు పార్లమెంటకు చేరే నాటికి నానారకాల వ్యాఖ్యానాలతో గందరగోళం సృష్టించిన ఆ పార్టీ.. లోక్ సభలో చర్చ నాటికి తన వ్యూహాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసింది. ఇందులో భాగంగానే వైసిపి వాడి పడేసిన, టిడిపి ఇంకా వాడుతున్న 'సమన్యాయం' బ్రాండ్ ను అందుకుంది. ప్రధానితో విందు సమావేశంలోనూ దీన్ని తెరపైకి తెచ్చింది. చివరకు లోక్ సభలో అధికార పార్టీతో కలిసి 'తెలంగాణ'ను పాస్ చేయించింది. అనంతరం.. తమకూ తెలంగాణ క్రెడిట్ ఇవ్వండి అంటూ తెలంగాణ ప్రజలకు దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు రాజ్యసభను వేదికగా మార్చుకుంది. తద్వారా సీమాంధ్రుల మెప్పు పొందాలనే ఆలోచన చేసింది. ఇందుకోసమే.. విభజన బిల్లుకు లోక్ సభలో సులభంగా మద్దతు తెలిపిన బిజెపి.. రాజ్యసభలో 'సవరణలు' చేయాలంటూ పట్టుబట్టే నాటకానికి తెరలేపింది. ఇందులో పలు సవరణలను సాధించామని కూడా ప్రచారం చేసుకుంటోంది. తద్వారా సీమాంధ్ర ప్రాంతంలోనూ ఎన్నికలకు సులభంగా వెళ్లొచ్చని భావిస్తోంది.

కాంగ్రెస్ కనుసన్నల్లో వైసిపి..
''రాష్ట్ర విభజన మా చేతిలో లేదు.. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే'' అంటూ కొన్ని రోజులు, ''రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలి'' అంటూ మరికొన్ని రోజులు.. ''రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి'' అని ఆ తర్వాత మాటలు మారుస్తూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం లోక్ సభలో తన వ్యూహాన్ని అమలు చేసింది. పరోక్షంగా కాంగ్రెస్ కు సహకరిస్తూ వచ్చింది. రాష్ట్ర శాసన సభలో ఆ పార్టీ సభ్యులు, ప్రెస్ మీట్లు పెట్టి ఆ పార్టీ అధినేత విభజనను ఖండించారు. కానీ.. పైకి సమైక్యమంటూ లోపల విభజనకు సహకరించారని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు పార్లమెంట్ లో సైతం కాంగ్రెస్ కు అనుకూలంగానే వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఇదంతా భవిష్యత్ సమీకరణాల్లో భాగమేనని పలువురు వ్యాఖ్యానించారు.

అరిగిపోయిన పాటనే ఆలపించిన టిడిపి...
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి, దాన్ని వెనక్కు తీసుకోకుండానే విభజన అన్యాయం, ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ వింత వ్యూహాన్ని అమలు చేసిన చంద్రబాబుకు ఆశించిన ఫలితం లభించలేదు. సమన్యాయం చేయాలని ఒక పక్క చెబుతూ.. అసలు సమన్యాయం అంటే ఏంటో వివరించకుండా వ్యవహరించిన బాబు ఉపాయం బెడిసికొట్టింది. సమైక్య ఛాంపియన్ అయ్యేందుకు లోక్ సభలో చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ ఎన్ని రకాల 'వేషాలు' వేసినా రావాల్సిన క్రెడిట్ రాలేదు. ఇదే క్రమంలో పెప్పర్ స్ప్రే ద్వారా లగడపాటి జీరోలాంటి హీరో అవడం ద్వారా జనం దృష్టిని ఆకర్షించారు. ఈ విధానాన్ని తామూ అనుసరించాలని భావించిన ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ రాజ్యసభలో గలాటా సృష్టించారు. కానీ.. అది అనుకున్నంత పేరు తేలేదు. పై పెచ్చు 'వియ్ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్' అంటూ ఛైర్మన్ ఎదుట అడ్డంగా నిలబడి కావాల్సినంత ప్రచారం కాంగ్రెస్ కు తెచ్చి పెట్టాడు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలోనూ తెలుగు దేశం పార్టీకి విభజన వ్యవహారం తలనొప్పినే మిగిల్చింది. తద్వారా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది నాలుగో శకుని టిడిపి పరిస్థితి. ఈ విధంగా ఎవరికి వారు విభజన అంశంపై క్రెడిట్ కొట్టేసేందుకు ఉపాయాలు పన్నారు. కానీ.. కొందరు మెరుగైన ఫలితాలు సాధించగా.. మరికొందరు డీలా పడిపోయారు.

No comments:

Post a Comment