Friday 28 February 2014

నేడు 29 రాష్ట్రాలు..! రేపు 50..?! (తెలంగాణతో రేగిన విభజన అలజడి..!)


తెలంగాణ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా విభజన తేనె తుట్టె కదిలిందా..? 
ఇతర ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభజన వాదం ఇకమీదట నిద్రలేవనుందా..?? 
ఇప్పుడు దేశంలో 29 రాష్ట్రాలు.. రేపు..? 
భవిష్యత్ భారతం ఎన్ని ముక్కలు కాబోతోంది..? 
అమెరికాను యుఎస్ఏ అన్నట్లు.. ఇండియాను యుఎస్ఐ అనాల్సిన పరిస్థితి దాపురిస్తుందా..? ఏం జరగబోతోంది..??
         పేరుకు దేశం..! కానీ.. రాష్ట్రానికో రాజ్యాంగం.. ఎవడి పాలన వాడిదే.. ఎవడి గోల వాడిదే..! ఇదీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పరిస్థితి..!! భవిష్యత్ లో భారత దేశానికి ఈ పరిస్థితి రాబోతోందా..? అనే అనుమానాలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇతర ప్రాంతాల్లో సైలెంట్ గా ఉన్న విభజన వాదం వాయిస్ పెంచుతోంది. తామూ వెనకబడ్డామనో, తమ ఆత్మగౌరవం కోసమనో.. ఏదో ఒక కారణం చెబుతూ తమకు ప్రత్యేక రాష్ట్రం కేటాయించాలనే ప్రాంతాలు ఇప్పుడు దేశ సమైక్యతకు సవాలు విసురుతున్నాయి. తమకూ ప్రత్యేక రాష్ట్రం కావాలని మరో 21 ప్రాంతాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఈ ప్రాంతాలన్నీ 'మా సంగతేంటి..?' జెండా కర్రలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం కోరుతున్న ప్రాంతాలివే.. 
1. బీహార్, జార్ఖండ్ లలో మైథిలీ భాష మాట్లాడే ప్రాంతాల వారు 'ప్రత్యేక మిథిలాంచల్' కోరుతున్నారు.
2. అస్సాం, నాగాలాండ్ లో నివసించే దిమాసా ప్రజలకు 'దిమాలాండ్..'
3. పశ్చిమ బెంగాల్ లో కూచ్ బేహార్, జల్ఫాయ్ గురిలతో పాటు మరి కొన్ని జిల్లాలతో 'కామ్తాపూర్'
4. బెంగాల్ లో డార్జిలింగ్ పరిసర ప్రాంతాలతో 'గూర్ఖాలాండ్'
5. ఒడిషాలోని కొన్ని జిల్లాలు, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాలతో 'కోసల్ '
6. మణిపూర్ కుకీ గిరిజనులు నివసించే ప్రాంతాలతో 'కుకీలాండ్'
7. మేఘాలయ లోని గారో ప్రాంతాలను కలిపి 'గారోలాండ్'
8. కర్ణాటక రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక 'కూర్గ్'
9. కర్ణాటక-కేరళ సరిహద్దు ప్రాంతాలతో 'తుళునాడు'
10. కొంకణి భాష మాట్లాడే వారితో 'కొంకణ్'
11. ఉత్తర ప్రదేశ్ ను నాలుగు భాగాలు చేయాలనే డిమాండ్ ఉంది. ఇందులో ఒకటి 'పూర్వాంచల్'
12. రెండోది 'అవథ్ ప్రదేశ్'
13. మూడోది 'బుందేల్ ఖండ్'
14. నాలుగోది 'పశ్చిమాంచల్' (లేదా) 'హరిత ప్రదేశ్'
15. అసోంలోని బోడో ప్రాబల్య ప్రాంతాలతో 'బోడోలాండ్'
16. అసోంలోని కర్బీ గిరిజన ప్రజలు నివసించే ప్రాంతాలతో 'కర్బీ ఆంగ్లాం'
17. మహారాష్ట్రలో 'విదర్భ'
18. గుజరాత్ లో 'సౌరాష్ట్ర'
19. జమ్మూ కాశ్మీర్ లోని లఢఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్
20. యూపీలోని ఆగ్రా, అలీగఢ్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోని భరత్ పూర్, గ్వాలియర్ జిల్లాలతో 'బ్రజ్ ప్రదేశ్'
21. ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాలు కలిపి 'భోజ్ పూర్'

భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం అసాధారణ పోరాటం... 
దేశంలోని రాష్ట్రాలన్నీ భాష ప్రాతిపదికన ఏర్పడాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆంగ్లేయుల పాలనా కాలంలోఅసాధారణ పోరాటం సాగింది. బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి ఒక భాష మాట్లాడే వారంతా ఒకే ప్రాంతంలో ఉంచాలన్న నినాదంతో ఉవ్వెత్తున ఉద్యమం నడిచింది. ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ ఈ పోరాటానికి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. అయితే.. ''విభజించు - పాలించు'' సూత్రాన్ని ఆంగ్లేయుల నుంచి పూర్తిస్థాయిలో వంటబట్టించుకున్న కాంగ్రెస్.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాన్ని తు.చ. తప్పకుండా పాటించింది. ఇందులో భాగంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. దీంతో.. అవిభక్త కమ్యూనిస్టు పార్టీతోపాటు, పొట్టి శ్రీరాములు లాంటి వారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం సాగించారు. ఆ పోరాట ఫలితంగానే దేశ వ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

తెలంగాణతో రేగిన అలజడి... 
ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఉన్నప్పటికీ కొంతకాలంగా సైలెంట్ గా ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన తీవ్రతరం అయిన నాటి నుంచి ఆయా ప్రాంతాలన్నీ నిశితంగా పరిశీలిస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోతే.. తామూ రంగంలోకి దూకాలని నిర్ణయించాయి. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో.. ''వారికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు..?'' అనే ప్రశ్నతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రాతిపదిక ఏంటి..? 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ముక్కలు చేసింది. కానీ.. దీనికి తగిన ప్రాతిపదిక ఏంటి..? అని ప్రశ్నిస్తే మాత్రం మూడు రకాల సమాధానాలు వినిపిస్తాయి...
60 ఏళ్ల డిమాండ్ : ఆరు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాం అని కాంగ్రెస్ పెద్దలు, మేమూ అందుకే మద్దతిచ్చామని బిజెపి నేతలు చెప్పుకొచ్చారు.
వెనకబడిన తెలంగాణ : అభివృద్ధి విషయంలో పాలకులు తెలంగాణ పట్ల వివక్ష చూపించారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోరామని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు.

డిమాండ్ పురాతనమైతే రాష్ట్రం ఇస్తారా..? 
కాంగ్రెస్ అధిష్టానం, బిజెపి నేతల ప్రకారం ప్రత్యేక డిమాండ్ చాలా కాలంగా ఉంటే రాష్ట్రం ఇచ్చేస్తారన్నమాట! ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రాతిపదిక ఇదేనా..? కాదు.. వెనుకబాటే ప్రాతిపదిక అంటే.. దేశంలో సగానికి పైగా ప్రాంతాలన్నీ తీవ్ర దారిద్ర్యంతో బాధపడుతున్నాయి. రేపు ఇవన్నీ ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుకుంటే ఇచ్చేస్తారా..?? ఆ మాట కొస్తే ఇటు రాష్ట్రాన్ని, అటు దేశాన్ని 60 ఏళ్ల స్వాతంత్ర్య కాలంలో 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత స్థానంలో ఉన్న బిజెపి పార్టీలే వెనకబాటుకు సమాధానం చెప్పాలి. ఈ వాస్తవాలన్నీ దాచిపెట్టి, కేవలం రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం రాష్ట్రాన్ని నిలువునా చీల్చేశారు.

తేనె తుట్టె కదిపిన కాంగ్రెస్, బిజెపి... 
దేశంలోని చాలా అనర్థాలన్నింటికీ కారణమైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు .. సరైన ప్రాతిపదిక లేకుండా ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టాయి. పార్లమెంటు సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని విభజన రాజకీయాలు నడిపారు. తద్వారా దేశంలోని వెనుకబడిన ప్రాంతాల తేనె తుట్టెను కదిపారు. అవి ఏ మలుపు తీసుకుంటాయి..? దేశ స్థిరత్వంపై ఎలాంటి దాడి చేయబోతున్నాయి..?? అనే దానికి కాలం సమీప భవిష్యత్ లోనే సమాధానం చెపుతుంది.

No comments:

Post a Comment