Friday 28 February 2014

తొలి భాషాప్రయుక్త రాష్ట్రం విభజన..! 29వ రాష్ట్రంగా తెలంగాణ..!!


భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం రెండు ముక్కలైంది.. ఆంధ్రప్రదేశ్ విభజనకు పెద్దల సభకూడా ఆమోదం తెలిపింది.. కాంగ్రెస్, బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల పెద్దల సభలోనూ టి. బిల్లు గట్టెక్కింది. దీంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. గురువారం రాత్రి 8 గంటల 12 నిమిషాల సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిందని ఛైర్మన్ కురినయ్ ప్రకటించారు. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్రవేసే కార్యక్రమం మాత్రమే మిగిలి ఉంది.

బిల్లును వ్యతిరేకించిన సీపీఎం... 
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును సీపీఎంతోపాటు సమాజ్ వాదీ పార్టీ, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, బిజెడి, జెడియూ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల దేశ సమైక్యతకే భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. విభజన వ్యవహారం ఒక్క ఏపీతోఏనే ఆగదని, దేశంలో ఇంకా చాలా ప్రాంతాల నుంచి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని ఆందోళన ప్రకటించాయి. అయినప్పటికీ సభలో ఏకమైన కాంగ్రెస్, బిజెపి టి.బిల్లును పాస్ చేయించేందుకే మొగ్గు చూపాయి.

విభజనకు పట్టుబట్టిన కాంగ్రెస్, బిజెపి...
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని కాంగ్రెస్, బిజెపి పట్టుబట్టాయి. వీటితోపాటు ఎన్ సిపి, సిపిఐ, బిఎస్ పి తదితర పార్టీలు రాష్ట్ర విభజనకు మద్దతునిచ్చాయి.

డివిజన్ పెట్టకపోవడం అప్రజాస్వామికం: ఏచూరి 
విభజన బిల్లుపై క్లాజుల వారీగా ఓటింగ్ పూర్తయిన తర్వాత బిల్లు ఆమోదానికి సంబంధించి డివిజన్ నిర్వహించాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. దీనికి ఛైర్మన్ నిరాకరించారు. సభ ఆర్డర్ లో లేనందువల్ల అది సాధ్యం కాదని చెప్పారు. దీనికి ఏచూరి స్పందిస్తూ ఇంత ముఖ్యమైన అంశంలో డివిజన్ లేకుండా ఆమోదించడం అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఛైర్మన్ నుంచి స్పందన లేకపోవడంతో వాకౌట్ చేస్తున్నట్లు ఏచూరి ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించిందని కురియన్ ప్రకటించారు.

No comments:

Post a Comment