Friday 28 February 2014

మమత సంచిలో అన్నా హజారే..! (ఎప్పుడు..? ఎందుకు..? ఎలా..?)


అవినీతి రహిత సమాజం కావాలని ఉద్యమించి, అభినవ గాంధీగా పేరుగాంచిన వ్యక్తి అన్నా హజారే. జన లోక్ పాల్ బిల్లు తేవాలని పోరాటం సాగించి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.. తన ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగుతుందని, ఏ పార్టీకీ తాను మద్దతు ఇవ్వబోనని చాటిచెప్పారు. అయితే.. అదంతా ఇప్పుడు గతం. ఆయన సాగించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చల్లబడినట్లుగానే.. ఆయన చెప్పిన మాటలు కూడా చెల్లని కాసులు అయిపోతున్నాయి. ఇందుకు.. మమతా బెనర్జీ పంచన చేరడమే ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయాలకు దూరం దూరం అంటూ వచ్చిన అన్నా.. ఇప్పుడు ఏకంగా.. వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఇందుకు ఆయన చూపుతున్న కారణాలు ఏంటంటే..? ''మమతా బెనర్జీ చాలా సాదాసీదాగా ఉంటారు.. ప్రభుత్వ భవనాల్లో నివసించట్లేదు. కాటన్ చీరలే కట్టుకుంటున్నారు.. ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి నేతలే.. అందుకే మమతకు మద్దతు ఇస్తున్నా...'' అంటూ మీడియా ఎదుట ఊదేశారు. కానీ.. నిజమైన కారణాలు ఇవేనా..? ఆమె బాహ్య నడవడికను చూసే హజారే మద్దతిస్తున్నారా..?? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా..???

'సాదాసీదా' అయితే.. రావాల్సింది ఇక్కడికి...
అన్నా హజారే తృణమూల్ కు మద్దతు ఇవ్వడానికి, సీఎం హోదాలో మమత చూపిస్తున్న సాదాసీదా వ్యక్తిత్వమే కారణమైతే.. హజారే మొదట వెళ్లాల్సింది మమత వద్దకు కాదు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వద్దకు. నాలుగు పర్యాయాలు త్రిపుర రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయినప్పటికీ.. కనీసం సొంత ఇల్లు కూడా లేని మాణిక్ సర్కార్ వద్దకు వెళ్లాలి. సీఎం పదవిలో ఉన్నందుకు నెలకు ఆయనకు వచ్చే వేతనాన్ని మొత్తం పార్టీకే ఇచ్చేస్తూ.. అందులోంచి కేవలం 5 వేల రూపాయలు మాత్రమే తన ఖర్చులకు వాడుకుంటున్న సర్కార్ వద్దకు హజారే వెళ్లాలి. ''దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి'' అంటూ అన్ని రకాల మీడియా నెత్తికెత్తుకున్న మాణిక్ వద్దకు వెళ్లకుండా.. మమత వద్దకే వెళ్లడంలో ఆంతర్యం ఏంటో అంతుబట్టకుండా ఉంది.

మమత పాలనలో అరాచకాలు కనిపించట్లేదా..?
మమతా బెనర్జీలో మెరుగైన నాయకత్వ లక్షణాలుకనిపించిన అన్నా హజారేకు బెంగాల్లో జరుగుతున్న దారుణాలు కనిపించకపోవడం మరీ విడ్డూరం. మహిళలపై రోజూ సాగుతున్న అత్యాచార కాండ, పసిపిల్లల మరణాలు, ప్రతిపక్షాలపై తృణమూల్ ప్రత్యక్ష దాడులు ఇవన్నీ అగుపించట్లేదా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటీవల బీర్భూమ్ జిల్లాలో ఒక మహిళపై 12 మంది సామూహిక అత్యాచారం చేశారు. అదికూడా.. తృణమూల్ నేత ఆదేశాలతోనే! ఇవేవీ అన్నాకు కనిపించకపోవడం ఆశ్చర్యం.

మోడీ రాయబారిగా హజారే..?
అన్నాహజారే వ్యవహార శైలిని పూర్తిగా గమనించిన వారు.. మోడీకి మేలు చేయాలనే ఉద్దేశంతోనే మమత వద్దకు వెళ్లినట్లు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల ద్వారా ఎలాగైనా ప్రధాని పీఠం దక్కించుకోవాలని చూస్తున్న మోడీకి.. థర్డ్ ఫ్రంట్ కునుకు పట్టనీయట్లేదు. దీంతో.. అవకాశం ఉన్న పార్టీలన్నింటినీ తనవైపు తిప్పుకోవాలని మోడీ భావిస్తున్నారు. బెంగాల్ లో విరోధులుగా ఉన్న కమ్యూనిస్టులతో ఎలాగూ థర్డ్ ఫ్రంట్ లోకి మమత వెళ్లే ప్రసక్తే లేదుగనుక ఎన్డీఏలోకి రప్పించుకోవాలని మోడీ పథకం పన్నారు. ఇందులో భాగంగానే కోల్ కతాలో ప్రసంగించిన సమయంలో మోడీ మమత ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈ నేపథ్యంలో హజారేను మమత పార్టీ తరపున ప్రచారం చేయించడం ద్వారా అటు బెంగాల్ లో కమ్యూనిస్టులను, తద్వారా థర్డ్ ఫ్రంట్ ను దెబ్బతీయడంతోపాటు, ఎన్డీఏకు తృణమూల్ మద్దతు సాధించవచ్చనే ప్లాన్ మోడీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్లాన్ మొత్తాన్ని పక్కాగా అమలు జరిపే బాధ్యతను అన్నా హజారేకు అప్పగించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే 'నాన్ పాలిటిక్స్ ' నుంచి 'ప్యూర్ పాలిటిక్స్' కు హజారే మారిపోయాడనే విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే.. ఒకనాటి తన సహచరుడు, ఇప్పటి ఆప్ అధినేత కేజ్రీవాల్ కు సైతం హజారే దూరమయ్యాడని పేర్కొంటున్నారు. 'ఆప్' ద్వారా కేజ్రీవాల్ బిజెపికి గండికొట్టారని, ఇది జీర్ణించుకోలేకే.. హజారే అతనితో తెగదెంపులు చేసుకున్నాడని చెబుతున్నారు. నిత్యం హజారే వెనకుండే కిరణ్ బేడీ తాను మోడీకే ఓటు వేస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఏదిఏమైనా.. మోడీకి మేలు చేసేందుకు మమత పంచన చేరిన హజారే.. తద్వారా బెంగాల్ లో కమలం ఉనికిని, మతోన్మాదాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment