Friday 28 February 2014

మూజువాణి ఓటు.. ప్రజాస్వామ్యానికి చేటు..?!


''మూజువాణి..'' ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న మాట. ఇదివరకూ చాలా మందికి అంతగా అవగాహన లేని ఈ ఓటింగ్ విధానం.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఇటు రాష్ట్ర అసెంబ్లీలో, అటు పార్లమెంటులో జరిగిన చర్చ ద్వారా అందరికీ తెలిసొచ్చింది. అయితే.. ఈ ఓటింగ్ విధానంపై చర్చ కూడా అదే స్థాయిలో సాగుతోంది. అసలు ఈ ఓటింగ్ విధానం సరైందేనా..? అటు పార్లమెంటులో, ఇటు అసెంబ్లీల్లో మెజార్టీ సభ్యుల అనుమతి లేకుండా ఒక బిల్లును పాస్ చేయించేందుకు దోహదపడుతున్న 'మూజువాణి'తో ప్రజాస్వామ్యానికి మేలుందా..??

మెజార్టీ అనుమతి లేకుండానే టి.బిల్లు పాస్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు విభజన జరగాలంటే.. మరొకరు సమైక్యంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఇరువైపులా ఆందోళనలు సాగాయి. ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశంపై ఒక నిర్ణయం తీసుకునే సమయంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటులో మెజార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండా అధికార పక్షం బిల్లును పాస్ చేయించింది. మొదట లోక్ సభలోనూ, తర్వాత రాజ్య సభలోనూ ఇదే విధంగా బిల్లును గట్టెక్కించింది. తద్వారా.. ఎవరు ఆంధ్రప్రదేశ్ విభజనకు అనుకూలంగా ఉన్నారో..? ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో..?? తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బిజెపితో కుమ్మక్కైన ప్రభుత్వం తన లక్ష్యం నెరవేర్చుకుంది.

రాష్ట్ర అసెంబ్లీలోనూ ఇదే తరహా... 
రాష్ట్రపతి పంపించిన ఆంధ్రప్రదేశ్ పునరవ్యవస్థీకరణ బిల్లు విషయంలోనూ ఇదేవిధంగా జరిగింది. బిల్లును వెనక్కి పంపాలంటూ ముఖ్యమంత్రి హోదాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తిరస్కార నోటీసుపై తెలంగాణ ప్రాంత సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును వెనక్కి పంపడానికి వీల్లేదని సభలో భీష్మించారు. అయినప్పటికీ నోటీసును సభలో ప్రవేశపెట్టిన స్పీకర్ నాదెండ్ల మనోహర్.. ఎలాంటి ఓటింగ్ చేపట్టకుండానే మూజువాణి ఓటు ద్వారా సీఎం తీర్మానం నెగ్గిందని ప్రకటించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజన బిల్లును తిరస్కరించిందని వెల్లడించారు.

ప్రజాస్వామ్యానికి చేటు కాదా..? 
రాష్ట్ర, దేశ ప్రజలను ప్రభావితం చేసే చట్టాలు రూపొందిస్తున్నప్పుడు.. వారికి ప్రతినిధులుగా ఉన్న సభ్యులు మెజార్టీ సంఖ్యలో వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇలాంటి పద్ధతే మేలు చేస్తుంది. కానీ.. మెజారిటీ సభ్యుల అనుమతి లేకుండా.. కనీసం ఎంత మంది అంగీకరిస్తున్నారు..? ఎంత మంది వ్యతిరేకిస్తున్నారనే విషయం తెలియకుండానే ఫలానా బిల్లు ఆమోదం పొందినట్లు ఎలా ప్రకటిస్తారు..? అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఈ ఓటింగ్ విధానంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment