Wednesday 30 April 2014

నేడు మేడే..

May Day 10tv.in

హైదరాబాద్: మే 1 (నేడు) మేడే. పెట్టుబడిదారీ వర్గ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గం నినదించిన రోజు. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోయ్ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. సమాజగతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం. అది చేస్తున్న నిరంతర శ్రమ. శ్రామికశక్తితోనే మానవ సంస్కృతి వికసించి ముందడుగు వేస్తోంది. కానీ ఆ శ్రమే బండచాకిరీగా మారినపుడు ఏమవుతుంది? శ్రామికుడు దారుణంగా దోపిడీకి గురైనపుడు ఏం జరుగుతుంది? కష్టించే చేతులు పిడికిళ్ళు బిగిస్తాయ్. భూకంపం సృష్టిస్తాయ్. ఉద్యమాలు పుట్టుకొస్తాయి.
130 ఏళ్ల క్రితమే కార్మికోద్యమం..
పెట్టుబడీదారీ ప్రపంచానికి పుట్టినిల్లైన అమెరికాలో దాదాపు 130 ఏళ్ళ క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమించారు. తరతరాల దోపిడీపై తిరుగుబాటు జరిగినపుడు చిందిన వెచ్చని నెత్తురే కేతనమై ఎగసింది.
అది అమెరికాలోని చికాగో నగరం..1886 మే 1
    
అమెరికాలోని చికాగోలో కార్మికులు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న రోజులవి. కార్మికులు రోజుకి 18-20 గంటలు పనిచేస్తున్న దోపిడీ కాలమది. పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమించే వారు. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలకోసం ఆరేడేళ్ళ పిల్లలతోనూ, మహిళలతనూ ఫ్యాక్టరీల్లో, గనుల్లో పనిచేయించారు. కార్మికులు చాకిరీ కొలిమిలో కుతకుతలాడిపోయిన సందర్భమది.
         ఆ దోపిడీ రాపిడిలోంచి తిరుగుబాటు అగ్గి రాజుకుంది. రోజుకి ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో కార్మికుల 1886 మే 1 ఉద్యమించారు. ఆ రోజు కార్మికవర్గ చైతన్యం వెల్లివిరిసింది. చికాగో నగర వీధుల్లో ఉత్సాహవంతులైన కార్మికుల కదం తొక్కారు. మూడున్నర లక్షలమంది కార్మికులు పోరాటబాట పట్టిన సార్వత్రిక సమ్మె అది. ఆ ఉద్యమం ప్రపంచవ్యాపితమై పెల్లుబికింది. అదే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే గా ప్రసిద్ధి కెక్కింది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మిక వర్గ చైతాన్యాన్ని ఏవిధంగానైనా నాశనం చేయాలని పెట్టుబడిదారి వర్గం నిర్ణయించుకుంది. దానికి ప్రభుత్వం అండగా నిలిచింది.
       అదే ఏడాది మే 3న శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మిక జనసమూహంపై అమెరికన్‌ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. ఈ దారుణ హత్యాకాండకు నిరసనగా మే 4న హే మార్కెట్‌లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రశాంతంగా సాగుతున్న సభ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. మధ్యలో బాంబు ప్రయోగం కూడా జరిగింది. ఒక పోలీసు సార్జెంట్‌ చనిపోయాడు. అది సాకుగా తీసుకుని పోలీసులు నిరాయుధులైన కార్మికులపై తుపాకులతో స్వైర విహారం చేశారు. ఈ సంఘర్షణలో ఏడుగులు పోలీసులు చనిపోగా నలుగురు కార్మికులు నేలకొరిగారు. హే మార్కెట్‌ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిసిపోయింది. అక్కడే ఆవిర్భవించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాడి శ్రమజీవుల స్వేచ్ఛా సంకేతమైన అరుణపతాకం.
           ఏ దేశంలోనైనా సమాజామార్పునకు చోదక శక్తి కార్మికవర్గమే. మనలాంటి వెనుకబడిన దేశాల్లో కార్మికులకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలోని ఇతర వర్గాలను కలుపుకుని ఉద్యమాలను పటిష్టం చేయాల్సి ఉంటుంది. గ్రామీణ భారతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కూలీల వలసలు, ఇతర సమస్యలపై ఉద్యమాలను నిర్మించాల్సి ఉంటుంది. రైతులతో ఇతర వర్గాలతో కార్మికులు భుజం,భుజం కలిపి పోరాడాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం శ్రామికవర్గం దీక్ష పూనాలి. ఆ మహత్తర సంకల్పంతోనే ముందుకుసాగాలి.

No comments:

Post a Comment