Friday 25 April 2014

'తిక్క' ముదిరింది..!

Pawan Kalyan praises Modi 

''దేశ సమగ్రతను దెబ్బ తీసేలా కుల, మత, ప్రాంతీయపరంగా కొందరు మాట్లాడుతున్నారు. వారిని నరేంద్ర మోడీ క్షమించరు.'' - పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు
ఈ మాటలు చాలవా.. పవన్ కళ్యాణ్ కు తిక్క ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి..?!
మతాన్ని రెచ్చగొట్టేదెవరో తెలీదా..?
ఈ దేశంలో మతమే ఎజెండాగా ముందుకు సాగుతున్న పార్టీ బీజేపీ అన్న విషయం రాజకీయాలపై ఏ కొద్దిపాటి అవగాహన ఉన్న వారికైనా తెలిసిన విషయం. మరి.. పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలియదా..? ఆ మాత్రం అవగాహన లేకుండానే పార్టీ పెట్టేశాడా.?? లేక.. అంతా తెలిసి కూడా, మతోన్మాద పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతో.. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా..??? బాబ్రీ మసీదు విధ్వంసం.. గుజరాత్ లో ముస్లింల ఊచకోత.. ముజఫర్ నగర్ హింస.. హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లు.. ఇవన్నీ పవన్ మరిచిపోయినట్లున్నాడు. ఇవన్నీ గత అనుకుంటే.. మొన్నటికి మొన్న మోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ''ముస్లింలపై ప్రతీకారం తీర్చుకోవాలి'' అని రెచ్చగొట్టేలా మాట్లాడడం.. వాటిని పవన్ దృష్టిలో బలమైన నేత అయిన నరేంద్ర మోడీ బలపర్చడం జరిగిపోయాయి. అంటే.. ముస్లింలపై దాడులకు సైతం వెనుకాడబోమని నరేంద్ర మోడీ చెప్పకనే చెప్పారు. మరి.. ఈ సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా..?
'ప్రాంతీయ' పాపంలో బీజేపీకి భాగం లేదా..?
 
పార్టీ ఆవిర్భాయ ప్రసంగంలో రాష్ట్ర విభజన పాపాన్ని ఒక్క కాంగ్రెస్ పై నెట్టేసిన పవన్ కళ్యాణ్.. అందుకు సహకరించిన బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు. కానీ.. హైదరాబాద్ లో జరిగిన టిడిపి-బిజెపి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సహకరించిందని చెప్పుకొచ్చారు. అంటే.. 'ఏ ఎండకు ఆ గొడుగు' అన్న చందంగా.. ఎక్కడ ఎలాంటి మాటలు అవసరమైతే.. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడుతారనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా..?!
మోడీ మూడు.. సర్కార్ నాలుగు.. అయినా...
 
''గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఎన్నికై రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.. బలమైన ఈ దేశాన్ని పాలించాలంటే.. మోడీ లాంటి బలమైన నేత కావాలి..'' అంటున్నాడు పవన్ కళ్యాణ్. మోడీ భ'జనసేన' అధ్యక్షుడిగా కీర్తి గడించిన ఈయనకు.. మోడీ తప్ప మరెవరూ కనిపిస్తున్నట్టు లేదు. త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఎన్నికలో మోడీ కన్నా ఒక మెట్టు ఎక్కువే ఉన్న సర్కార్.. అవినీతికి ఆమడదూరంలో ఉంటారు. దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి. కేవలం నెలకు 5 వేల వేతనంతో బతుకు బండి లాగిస్తున్న నిజమైన ప్రజానాయకుడు. తనదైన లీడర్ షిప్ తో త్రిపురను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఇన్ని క్వాలిటీలు కలిగిన మాణిక్ సర్కార్ కు పవన్ కళ్యాణ్ కళ్లకు ఎందుకు కనిపించట్లేదో..? దీనికి ఆయనే సమాధానం చెప్తే బాగుంటుంది.
దేశ సమగ్రతకు బీజేపీ ఎలా పాటుపడుతుంది..??
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడంలో బీజేపీకి పాత్ర ఉండడమే కాదు.. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే హయాంలోనే జరిగాయి. ఇంకా.. అనేక రాష్ట్రాలను విడదీయాలనే ప్రణాళికను బీజేపీ రూపొందించింది. ''చిన్న రాష్ట్రాలు - బలమైన కేంద్రం'' అన్న నినాదంతో దేశాన్ని అరవై రాష్ట్రాలుగా విభజించాలని ఆ పార్టీ కంకణం కట్టుంది. అలాంటి పార్టీ చేతిలో దేశాన్ని పెడితే దేశ సమగ్రత మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా వెలుగుతుందని తాను నమ్మడమే కాకుండా.. జనులంతా నమ్మండని చెప్తున్న ఈ పవన్ కళ్యాణ్ ను ఏమనాలి..? పై పరిణామాలన్నీ గమనిస్తుంటే.. పవన్ కళ్యాణ్ లెక్కుందని చెప్పుకుంటున్న తిక్కకు లెక్కే లేదని, ఆ తిక్క దారుణంగా ముదిరిపోయిందని అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు..

No comments:

Post a Comment