Friday 25 April 2014

1+1+1 = 111 (అరె బై.. గిదేం లెక్క..?!)

Narendra Modi

హైద్రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. తెలంగాణ ప్రజల నుంచి ఓట్లు రాల్చుకోవడానికి ఆయన పడిన తాపత్రయం మొత్తం ఆయన మాటల్లనే కనపడ్డది.. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసిందని, తెలంగాణ ఏర్పడేదానికి తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి జేసిందని చెప్పుకొచ్చారు. మళ్లీ వెంటనే.. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనే తల్లిని చంపేసింది, ఇది చాలా దుర్మార్గం, అన్యాయం అని మొత్తుకోవడం మొదలు పెట్టారు. అయితే.. తల్లిని చంపేందుకు అవసరమైన కత్తిని అందించింది తామేనని మాత్రం అనకుండా జాగ్రత్తపడ్డారు.. గిట్ల కిరాక్ కిరాక్ గా మాట్లడుతున్న మాటలతోనే సభకు హాజరైన జనాలు బుర్రగోక్కుంటుడగా.. మరో తిక్క'లెక్క' ఒకటి వదిలారు...
1+1+1 = 3 కాదట..! 1+1+1 = 111
 ''మూడు ఒకట్ల మూడు కాదు.. నూట పదకొండు అన్నడు..''! ఇది విన్న జనాల బుర్ర గిర్రుర్రుర్రు...న తిరిగింది. మరోసారి గిదే లెక్క చెప్పిండు.. అర్రే.. ఒకటో తరగతి సదువుతున్న పిల్లగాన్ని అడిగినా.. అమెరికా ప్రెసిడెంటు ఒబామాను అడిగినా.. చివరకు.., సచ్చిపోయి నరకంలో ఉన్నడో, స్వర్గంలో ఉన్నడో.. యాడున్నడో తెల్వదుగానీ.. ఒసామా బిన్ లాడెన్ ను అడిగినా... 1+1+1 = ఎంత..? అంటే '3' అంటరు. కానీ.. గీయనేంది..? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నడు, దేశానికి ప్రధాన మంత్రి అవుతానంటున్నడు.. ఇలాంటాయనకు మూడు ఒకట్లు ఎంతో తెల్వదా..? రామచంద్రా ఇదెక్కడి చోద్యం..?! అంటూ కొంతమంది ముక్కుమీద వేలేసుకోబట్టె.
మాజీ ముఖ్యమంత్రి అంజయ్య దళితుడట..!!
 మోడీజీ.. పైన పేర్కొన్న పైత్యం నుంచి తేరుకోకుండానే మరో అజ్ఞాన బాణం విసిరిండు. తెలంగాణ నేతలను ప్రస్తావించడం ద్వారా.. ఇక్కడి ప్రజలు మనసు గెలుచుకోవాలని భావించిన మోడీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్యను కాంగ్రెస్ నేతలు అవమానించారని, దానికి కారణం.. ఆయన దళితుడు కావడమేనని అనేశారు. ఇది విన్న సభికులంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అంజయ్య.. దళితుడిగా ఎప్పుడు మారాడబ్బా..? అని ఆలోచనలో మునిగిపోయిండ్రు. తెలియనప్పుడు.. తెలియనట్లుండాలిగానీ.. గివేం.. తెలివితక్కువ మాటలు..? అంటూ కొందరు చెవులు కొర్కున్నరు.
ఇదేం మొదటిసారి కాదు...
 తనకు తెలియని విషయాల గురించి మాట్లాడుతూ.. పప్పులో, ఉప్పులో కాలేయడం మోడీ ఇదేం మొదటిసారి కానే కాదు. గతంలోనూ చాలా సార్లు ఇలా తెలియని విషయల్లో తనకేదో తెలివితేటలున్నట్లు మాట్లాడి అభాసుపాలయ్యారు. పాట్నా ర్యాలీలో ప్రసంగించినప్పుడు బీహారీలకు మస్కా కొట్టాలనే ఆరాటంలో.. ''విశ్వవిజేత అలెగ్జాండర్ ను ఓడించిన ఘనత బీహారీలదే..'' అనేశాడు. అయితే.. ఈ విషయం తెలియని వారు. ఆహా.. ఓహో.. అని చప్పట్లు కొట్టగా.. విద్యావంతులు మాత్రం.. ''నీ తెలివి తగలెయ్య..'' అని నెత్తిబాదుకున్నరు. ఎందుకంటే.. అలెగ్జాండర్ గంగానది దాటి బీహార్ లోకి అడుగు పెట్టనే లేదు. ఈ విషయం తెలియకుండా చప్పట్ల కోసం ఆరాటపడి, నవ్వుల పాలయ్యాడు మోడీ. అదేవిధంగా.. తక్షశిల గొప్పతనాన్ని పొగుడుతూ.. అది బీహార్ లో ఉండడం ఎంతో గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు. కానీ.. వాస్తవం ఏంటంటే.. తక్షశిల ప్రస్తుత పాకిస్థాన్ లో ఉంది. ఈ విధంగా తెలియని విషయాల్లోనూ తనకు ఎంతో ప్రజ్ఞ ఉందని చాటుకోవడం కోసం ప్రయత్నించడం.. తప్పులు మాట్లాడడం.. దెబ్బైపోవడం మోడీకి ఒక అలవాటుగా మారింది.
పోల్ సర్వేలన్నీ ఒట్టివే...
 పైన చెప్పుకున్న అన్ని విషయాల్లోనూ తప్పులు మాట్లాడిన మోడీ.. హైదరాబాద్ సభలో ఒక్క నిజం చెప్పారు. అదే.. ఎగ్జిట్ పోల్స్ గురించి. రాజకీయ విశ్లేషకులు ఏసీ గదుల్లో కూర్చొని లెక్కలు వేస్తుంటారని, అవన్నీ చిత్తుకాగితాలతో సమానం అని అన్నారు. ఇప్పటి వరకూ వచ్చిన పోల్ సర్వేలన్నీ నిజాలు కావని, వాటి ఊహకు అందని విధంగా ఫలితాలు వస్తాయని చెప్పారు. అంటే.. బీజేపీకి అధిక సంఖ్యలో సీట్లు వస్తాయని ఊదరగొట్టిన సర్వేలన్నీ వట్టి మాటలేనని మోడీ తేల్చేశారు. కాబట్టి.. మోడీ గాలి వీస్తోందని, బీజేపీ హవా సాగుతోందని చెప్తున్నవన్నీ సొలు కబుర్లేనన్న విషయం నిజమేనని మోడీ ఒప్పేసుకున్నారన్నమాట..!

No comments:

Post a Comment