Friday 25 April 2014

చంద్రబాబు 'చారిత్రక' ముచ్చట్లు..!


'' మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పు చేశాను...''
- 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు ప్రకటన
'' బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం చారిత్రక అవసరం... ''
- 2014 ఎన్నికల ముందు చంద్రబాబు తాజా ప్రకటన
చంద్రబాబు మాటలు నమ్మాలా..? వద్దా..?? ఆయన చెప్పేవి అక్షర సత్యాలా..? జనాన్ని మోసం చేసే అసత్యాలా..??
అనేవి తెలుసుకోవడానికి పై మాటలు చాలవా..?!!
మోడీ-చంద్రబాబు ఓ జట్టట..!
హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ''మా ఇద్దరిదీ ఒక జట్టు'' అన్నారు. నిజమే.. కాదని ఎవరన్నారు..? వీరిద్దరిదీ ఖచ్చితంగా ఒక్కటే జట్టు..! మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందడానికి, గుజరాత్ నమూనా పేరుతో శుద్ధ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రధాని పీఠం దక్కించుకోవడానికి ఆరాటపడుతున్న వ్యక్తి ఒకాయన. ప్రజాసంక్షేమాన్ని నిర్వీర్యం చేసి, రాష్ట్ర విభజన విషయంలో రెండు పాటలు పాడి, ఇప్పుడు.. రెండింటా అధికారం దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్న వ్యక్తి మరొకాయన.. వీరిద్దరిలో కామన్ అంశాలు..'' అబద్ధాలు చెప్పడం.. అధికారం కోసం నానాగడ్డి కరవడం..'' మరి.. ఈ విధంగా చూసుకున్నప్పుడు వీరిద్దరిదీ ఒకే జట్టు కాదని ఎలా అనగలం..?!
అవినీతిని తరిమికొట్టే శక్తి మోడీకే ఉందట..!!
అవునా..? మరి.. 2011-12లో రూ. 1,275కోట్లను కార్పొరేట్ కంపెనీలకు గుజరాత్ సర్కారు అప్పనంగా కట్టబెట్టిందని, ఈ నజరానాలు స్వీకరించిన వారిలో ఆదాని, ఎస్ఆర్, లార్సాన్ అండ్ టుబ్రో మొదలైన బడా కంపెనీలున్నాయని, ఈ బాగోతంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తూ కాగ్ బయటపెట్టిన వాస్తవాలన్నీ చంద్రబాబు దృష్టిలో అవాస్తవాలా..?! బహిరంగ మార్కెట్ లో మూడు వేల రూపాయలు పలుకుతున్న చదరపు మీటరు స్థలాన్ని అతి దారుణంగా ఒక్కటంటే ఒకే ఒక్క రూపాయికి ముంద్రాపోర్టుకు, సెజ్ లకు కట్టబెట్టిన వైనాన్ని చంద్రబాబు దృష్టిలో అవినీతి అనరుకాబోలు. బాబు మాటల్లో ''ఇచ్చి పుచ్చుకోవడం అనుకుంటా..''
తెలంగాణకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తడట..!!!
 ఈ పదం విన్న తర్వాత ఒక సందేహం కలుగుతోంది..! చంద్రబాబు దృష్టిలో ప్రజలు మరీ అంత వెర్రివాళ్లలాగా.. ఎప్పటి సంఘటన అప్పుడే, వెంటనే మరిచిపోయే గజినీల్లాగా కనిపిస్తున్నారా..?! అర్థం కావట్లేదు. ఈయన ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టిన సమయంలో (2000 సంవత్సరం) విద్యుత్ కోసం ఉద్యమించిన వారిపై పోలీసులను ఉసిగొల్పి, భాష్పవాయు గోళాలతో దండెత్తి, వాటర్ కేనన్లు ప్రయోగించి, లాఠీలతో ఉద్యమకారులను కుళ్లబొడిచి, చివరకు.. అత్యంత దారుణంగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించి, ముగ్గురిని బలితీసుకున్నారు. అలాంటి వ్యక్తి .. నేడు అదే విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు.. ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొస్తున్నారు.. అందువల్ల తనను అధికారంలో కూర్చోబెడితే.., మీకు నాణ్యమైన, అవసరమైన, కొరతలేని, కోత లేని విద్యుత్ ఇస్తానంటూ ముచ్చట చెబుతున్నాడు. అంటే.. నాటి విధ్వంసాన్ని చంద్రబాబు గారు మరిచిపోయినట్లుగా.. ప్రజలు కూడా మరిచిపోయి ఉంటారని భావిస్తున్నట్లున్నారు. పాపం హైటెక్ మాజీ ముఖ్యమంత్రి..!
దేశం.. చైనా, అమెరికాలను మించిపోతుందట..!!!
 ''ఆపరేషన్ దుర్యోధన'' సినిమాలో రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన హీరో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ''హైదరాబాద్ కు ఓడరేపు తెప్పిస్తానని హామీ ఇస్తున్నా..'' అంటాడు. సభికుల్లోని ఓ వృద్ధుడు స్పందిస్తూ.. ''హైదరాబాద్ లో సముద్రం లేదురా సన్నాసి.. ఓడరేవు ఎలా తెస్తావురా..?'' అంటే.. ''అలాగా.. అయితే హైదరాబాద్ కు సముద్రాన్ని కూడా తెప్పిస్తానని సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా..'' అంటాడు. అచ్చం ఇదే విధంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు. భారత దేశం చైనా, అమెరికాలను మించిపోతుందని బాబు చెప్పేశాడు. కానీ.. అది ఎలా సాధ్యం..? ఇప్పటి వరకూ దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ అనుసరించిన విధానాలనే మరింత బలంగా అమలు చేస్తానని మోడీ చెప్తున్నాడు. అంతే తప్ప, కొత్త విధానాలు అమలు చేస్తాననే మాట ఎక్కడా చెప్పట్లేదు. అంటే.. తాను అధికారంలోకి వస్తే.. ఇప్పటి వరకూ దేశ ప్రజలు అనుభవించిన కష్టాలు మరింత రెట్టింపు అవుతాయని మోడీ చెప్పకనే చెప్తున్నాడు. మరి.. అలాంటప్పుడు దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది..? చైనా, అమెరికాలను ఎలా దాటుతుంది..?? ఇది హైటెక్ బాబుకు తెలియదా..? తెలిసి కూడా ఓట్ల కోసం జనాన్ని మోసం చేస్తున్నారా..?? ప్రజలే అర్థం చేసుకోవాలి.

No comments:

Post a Comment