Wednesday 23 December 2015

ఏపీ అంగన్ వాడీలపై సర్కార్ కక్ష సాధింపు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీలపై కక్ష గట్టింది. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగించాలంటూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరి..
నియంతలా ప్రదర్విస్తోందని దుయ్యబడుతున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా వేతనాలు..ఇతరత్రా సమస్యలపై అంగన్ వాడీలు ఆందోళన బాట పట్టారు. దీనిపై ప్రభుత్వం తలొగ్గినట్టే కనిపించింది. వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు దీనిపై నియమించబడిన ఉప సంఘం పేర్కొంది. కానీ ఈ హామీ అమలు చేయకపోవడం..జీవో అమలు చేయకపోవడం పట్ల అంగన్ వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా జీతాలు లేకపోవడం..తిండికి ఇబ్బందులు పడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగన్ వాడీలు ఈ నెల 18వ తేదీన చలో బెజవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున్న అంగన్ వాడీలు పాల్గొన్నారు. వీరి ఆందోళనకు సీఐటీయూ, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. కానీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. నిర్భందం ప్రయోగించింది. లాఠీలతో కుళ్లబొడిచారు. దీనితో చాలా మంది అంగన్ వాడీలు గాయపడ్డారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వారి వేతనాలు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు.
తాజాగా ఈ పోరాటంలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగిస్తున్నట్లు కలెక్టర్లకు స్పెషల్ కమిషనర్ చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వామపక్షాలు..ఇతర ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో మరో ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. 

No comments:

Post a Comment